volcano trekking accident: అగ్నిపర్వతం పైనుంచి జారిపడ్డ పర్వతారోహకురాలు.. వీడియో ఇదిగో!

Brazilian Woman Falls to Death on Mount Rinjani Volcano
  • నాలుగు రోజుల పాటు నరకం అనుభవించి సాయం అందేలోగా మృతి
  • ఇండోనేసియాలోని మౌంట్ రింజాని ట్రెక్కింగ్ లో విషాదం
  • ప్రతికూల వాతావరణంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం
ఇండోనేసియాలో క్రియాశీల అగ్నిపర్వతంపై ట్రెకింగ్ చేస్తూ ఓ బ్రెజిల్ యువతి ప్రాణాలు కోల్పోయింది. జూలియానా మారిన్స్ (26) అనే పబ్లిసిస్ట్, లొంబోక్ ద్వీపంలోని ప్రఖ్యాత మౌంట్ రింజాని అగ్నిపర్వతంపై తన స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం సుమారు 6:30 గంటల సమయంలో పర్వత శిఖరానికి వెళ్తుండగా ఆమె కాలుజారి దాదాపు 490 అడుగుల లోతైన కొండచరియల మధ్య పడిపోయినట్లు అధికారులు తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే ఆమె సహాయం కోసం కేకలు వేసినట్లు సమాచారం. డ్రోన్ ఫుటేజ్ ద్వారా ఆమె తొలుత ప్రాణాలతోనే ఉన్నట్లు గుర్తించినప్పటికీ, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, దట్టమైన పొగమంచు, క్లిష్టమైన భూభాగం కారణంగా సహాయక బృందాలు వెంటనే ఆమె వద్దకు చేరుకోలేకపోయాయి. బాధితురాలు మృదువైన ఇసుకలో చిక్కుకుపోవడంతో తాళ్ల సహాయంతో బయటకు తీసుకురావడం చాలా కష్టంగా మారిందని స్థానిక సహాయక బృందం నాయకుడు ముహమ్మద్ హరియాది తెలిపారు.

నాలుగు రోజుల పాటు సాగిన సహాయక చర్యల అనంతరం, మంగళవారం జూలియానా మారిన్స్ మృతదేహాన్ని కనుగొన్నట్లు ఇండోనేసియా సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ బృందాలు, బ్రెజిల్ ప్రభుత్వం ధృవీకరించాయి. జూలియానా కుటుంబ సభ్యులు కూడా ఆమె మరణ వార్తను సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

ఇండోనేసియాలో రెండో అతిపెద్ద అగ్నిపర్వతమైన మౌంట్ రింజానీ ఎత్తు 12,224 అడుగులు.. ఏటా వేలాది మంది పర్యాటకులు ఈ పర్వతాన్ని సందర్శిస్తుంటారు. అయితే, ఈ ప్రాంతంలో గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. గత నెలలో కూడా మలేసియా పర్యాటకుడు ఒకరు ఇక్కడ మరణించినట్లు తెలిసింది.
volcano trekking accident
Juliana Marins
Mount Rinjani
Indonesia volcano
Lombok island
mountain climbing death
Brazilian tourist
search and rescue operation
volcano hiking

More Telugu News