Dinesh Karthik: భారత బ్యాటింగ్ లైనప్ డాబర్‌మన్ కుక్కలాంటిది: దినేశ్ కార్తీక్

Dinesh Karthik India Batting Like Doberman Dog
  • ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో భారత్ ఓటమి
  • శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో తొలి మ్యాచ్‌లోనే పరాజయం
  • రెండు ఇన్నింగ్స్‌లలోనూ విఫలమైన భారత లోయర్ ఆర్డర్
  • సిరీస్‌లో 1-0తో ఇంగ్లండ్ ఆధిక్యం
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు పరాజయం పాలైంది. శుభమన్‌ గిల్ కెప్టెన్సీలో తొలి మ్యాచ్‌లోనే టీమిండియా ఓటమి చవిచూసింది. ఓపెనర్ బెన్ డకెట్ అద్భుత సెంచరీ (149)తో 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ అవలీలగా ఛేదించింది. మ్యాచ్‌పై తొలుత పట్టు సాధించిన భారత జట్టు ఆ తర్వాత క్రమంగా పట్టు సడలించి ఓటమిని కొని తెచ్చుకుంది. ముఖ్యంగా లోయర్-మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల వైఫల్యం ఇంగ్లండ్ పుంజుకోవడానికి అవకాశం కల్పించింది.

తొలి ఇన్నింగ్స్‌లో భారత్ చివరి ఏడు వికెట్లను కేవలం 41 పరుగుల తేడాలో కోల్పోగా, రెండో ఇన్నింగ్స్‌లో చివరి ఆరు వికెట్లు 31 పరుగులకే నేలకూలాయి. రెండు సందర్భాల్లోనూ ఇంగ్లండ్‌పై పూర్తి ఆధిపత్యం చలాయించే అవకాశం ఉన్నప్పటికీ, లోయర్ ఆర్డర్ పేలవ ప్రదర్శన దెబ్బతీసింది. ఈ తప్పిదమే చివరికి భారత్ ఓటమికి దారితీసి, సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యం సాధించడానికి కారణమైంది.

భారత బ్యాటింగ్ లైనప్‌లో టెయిలెండర్ల వైఫల్యంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. జట్టుకు అవసరమైన సమయంలో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు పరుగులు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

భారత బ్యాటింగ్ లైనప్ డాబర్‌మన్ కుక్కలా ఉందని ఎవరో ట్విట్టర్‌లో పోస్టు చేశారని పేర్కొన్న కార్తీక్.. డాబర్‌మన్ కుక్కు తలభాగం బాగుంటుందని, మధ్యభాగం పర్లేదని, కానీ తోక మాత్రం అస్సలు ఉండదని భారత బ్యాటింగ్ తీరును చమత్కారంగా విశ్లేషించాడు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జులై 2న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ప్రారంభమవుతుంది.
Dinesh Karthik
India batting lineup
India vs England
England Test series
Ben Duckett
Indian cricket team
Test match
Doberman dog
Cricket analysis
Lower order batting

More Telugu News