Morning Midas: 3 వేల వాహనాలతో వస్తూ పసిఫిక్ మహాసముద్రంలో మునిగిన భారీ నౌక

Morning Midas cargo ship sinks in Pacific with 3000 vehicles
  • అగ్నిప్రమాదం తర్వాత అలస్కా సమీపంలో ఘటన
  • సిబ్బంది సురక్షితం, ఎలాంటి ప్రాణనష్టం లేదన్న అధికారులు
  • ప్రస్తుతానికి కాలుష్య ఆనవాళ్లు లేవన్న యూఎస్ కోస్ట్ గార్డ్
  • మూడు వారాల క్రితమే నౌకలో చెలరేగిన మంటలు
మెక్సికోకు వేలాది వాహనాలను రవాణా చేస్తున్న ఓ భారీ కార్గో నౌక అగ్నిప్రమాదానికి గురైన కొన్ని వారాల అనంతరం ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. ఈ నౌకలో సుమారు 800 ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు మొత్తం 3,000 కొత్త వాహనాలు ఉన్నట్లు సమాచారం. 

లండన్‌కు చెందిన జోడియాక్ మారిటైమ్ అనే సంస్థ ‘మార్నింగ్ మిడాస్’ అనే ఈ నౌక నిర్వహణ వ్యవహారాలు చూస్తోంది. అలస్కాలోని అలూషియన్ దీవుల సమీపంలో అంతర్జాతీయ జలాల్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని సంస్థ వెల్లడించింది. అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) కథనం ప్రకారం.. మంటల వల్ల జరిగిన నష్టం, ప్రతికూల వాతావరణం, నౌకలోకి నీరు చేరడం వంటి కారణాలతో తీరానికి 415 మైళ్ల దూరంలో, సుమారు 16,404 అడుగుల లోతున నౌక మునిగిపోయింది. ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతంలో ఇప్పటివరకు ఎలాంటి కాలుష్య ఆనవాళ్లు కనిపించలేదని యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి, ఆఫీసర్ కామెరాన్ స్నెల్ తెలిపారు.  

మూడు వారాల క్రితమే అగ్నిప్రమాదం
అలస్కా తీరానికి దాదాపు 300 మైళ్ల దూరంలో ఉండగా ఈ నెల 3న నౌకలో మంటలు చెలరేగాయి. నౌక నుంచి ప్రమాద సంకేతాలు అందడంతో యూఎస్ కోస్ట్ గార్డ్ తక్షణమే స్పందించింది. ప్రమాద సమయంలో నౌకలో ఉన్న 22 మంది సిబ్బంది లైఫ్‌బోట్ల ద్వారా సురక్షితంగా బయటపడ్డారని, వారిని సమీపంలోని ఓ వాణిజ్య నౌక సిబ్బంది రక్షించారని కోస్ట్ గార్డ్ ధ్రువీకరించింది.  

చైనాలోని యెంటాయ్ నుంచి మే 26న బయలుదేరిన ఈ నౌక మెక్సికోలోని లాజారో కార్డెనాస్‌కు వెళ్తోంది. మంటలను ఆర్పేందుకు కోస్ట్ గార్డ్ సిబ్బంది తొలుత విమానాలు, ఒక కట్టర్ షిప్‌ను పంపారు. ప్రయోజనం లేకపోవడంతో కొన్ని రోజుల తర్వాత ఒక సహాయక బృందాన్ని పంపించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లైబీరియా జెండాతో రిజిస్టర్ అయిన ఈ నౌకను 2006లో నిర్మించారు.
Morning Midas
Cargo ship fire
Pacific Ocean
Ship sinking
Mexico car shipment
Electric vehicles
US Coast Guard
Alaska
Maritime accident
Zodiac Maritime

More Telugu News