Neeraj Chopra: నెల రోజుల వ్యవధిలో నీరజ్ చోప్రాకు రెండో టైటిల్.. ఓస్ట్రావాలో గోల్డ్!

- ఓస్ట్రావా గోల్డెన్ స్పైక్ 2025 మీట్‌లో నీరజ్ చోప్రాకు స్వర్ణం
- 85.29 మీటర్ల త్రోతో జావెలిన్‌లో అగ్రస్థానం కైవసం
- దక్షిణాఫ్రికాకు చెందిన డౌవ్ స్మిత్ రజతం
- గ్రెనడాకు చెందిన పీటర్స్ కాంస్యం
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి అంతర్జాతీయ వేదికపై సత్తా చాటాడు. చెక్ రిపబ్లిక్‌లోని ఓస్ట్రావాలో మంగళవారం జరిగిన ప్రతిష్ఠాత్మక గోల్డెన్ స్పైక్ 2025 మీట్‌లో నీరజ్ స్వర్ణ పతకాన్ని ముద్దాడాడు. ఈ వన్డే పోటీలో నీరజ్ తన అత్యుత్తమ ప్రదర్శనతో 85.29 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి అగ్రస్థానంలో నిలిచాడు.
ఆరు రౌండ్ల ఈ పోటీలో తన మూడో ప్రయత్నంలో 85.29 మీటర్లు విసిరి ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఆ తర్వాత మిగిలిన అథ్లెట్లు ఎవరూ ఈ మార్కును దాటలేకపోయారు. దీంతో మరో త్రో మిగిలి ఉండగానే నీరజ్ విజయం ఖాయమైంది. ఈ సీజన్‌లో ఆయనకు ఇది మరో అగ్రశ్రేణి విజయం కావడం విశేషం. కొద్ది రోజుల క్రితమే పారిస్ డైమండ్ లీగ్ మీట్‌లో విజేతగా నిలిచిన నీరజ్, నెల రోజుల వ్యవధిలోనే రెండో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
పోటీ ఆరంభంలో నీరజ్ తొలి ప్రయత్నం ఫౌల్ అయింది. రెండో ప్రయత్నంలో 83.45 మీటర్లు విసిరిన అతడు, మూడో ప్రయత్నంలో అద్భుతంగా పుంజుకుని 85.29 మీటర్లతో అందరికంటే ముందు నిలిచాడు. ఆ తర్వాత నాలుగో ప్రయత్నంలో 82.17 మీటర్లు, ఐదో ప్రయత్నంలో 81.01 మీటర్లు మాత్రమే నమోదు చేశాడు. తన ఆరో, చివరి ప్రయత్నాన్ని సరిగ్గా విసరలేకపోయానని భావించి ఉద్దేశపూర్వకంగానే ఫౌల్ చేశాడు.
ఈ పోటీలో దక్షిణాఫ్రికాకు చెందిన డౌవ్ స్మిత్ 84.12 మీటర్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకోగా, గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 83.63 మీటర్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకున్నారు.