Ward Sachivalayam: ఏపీ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలపై ఆంక్షల తొలగింపు

AP Ward Sachivalayam Employee Transfer Restrictions Lifted
  • ఉద్యోగులకు బదిలీల్లో ఊరట కల్పిస్తూ ప్రభుత్వ నిర్ణయం
  • సొంత మండలానికి బదిలీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన సర్కార్
  • పనిచేస్తున్న పట్టణంలోని ఇతర వార్డులకు, ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలకు బదిలీకి అర్హత
  • ప్రభుత్వ నిర్ణయంపై గ్రామ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి అసంతృప్తి
రాష్ట్రంలోని వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. బదిలీలకు సంబంధించి వెసులుబాటు కల్పించే నిర్ణయం తీసుకుంది. బదిలీలకు సంబంధించి ప్రస్తుతం అమలు చేస్తున్న నిబంధనలను సడలిస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం.. వార్డు సచివాలయ ఉద్యోగులు ఇకపై తమ సొంత మండలానికి బదిలీపై వెళ్లవచ్చు. దీంతోపాటు, ప్రస్తుతం పనిచేస్తున్న పట్టణంలోని ఇతర వార్డులకు లేదా ఉమ్మడి జిల్లా పరిధిలోని ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు బదిలీ అయ్యేందుకు కూడా అవకాశం కల్పించింది. ఇదివరకున్న నిబంధన ప్రకారం సొంత మండలానికి బదిలీపై వెళ్ళే అవకాశం లేదు. ఈ మార్పు వల్ల చాలా మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు.

అయితే, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీ విషయంలో వెసులుబాటు కల్పించడంపై గ్రామ సచివాలయ ఉద్యోగుల నుంచి భిన్నమైన స్పందన వ్యక్తమవుతోంది. తమకు కూడా ఇదే తరహాలో బదిలీ నిబంధనలను సడలించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒకే శాఖకు చెందిన ఉద్యోగుల విషయంలో రెండు వేర్వేరు నిబంధనలు అమలు చేయడం సరైన పద్ధతి కాదని వారు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో, తమకు కూడా సొంత మండలాల్లో పనిచేసే అవకాశం కల్పించాలని కోరుతూ అన్ని జిల్లా, మండల కేంద్రాల్లోని సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరిణామం సచివాలయ ఉద్యోగుల వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Ward Sachivalayam
AP Ward Sachivalayam
Andhra Pradesh
Ward Secretariat Employees
Grama Sachivalayam
Employee Transfers
AP Government
Employee Welfare
Municipalities
Corporations

More Telugu News