వీసాదారులకు అమెరికా కీలక సూచన

  • త్వరలోనే ఎఫ్ఎంజే వర్గాల వీసాల షెడ్యూలింగ్‌ను పునరుద్దరిస్తామన్న అమెరికా
  • వీసాదారులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో ప్రైవసీ సెట్టింగ్స్‌ను పబ్లిక్ చేయాలని సూచన
  • కొత్త నిబంధనల ప్రకారం వీసాదారుల ఆన్‌లైన్ కార్యకలాపాలను పూర్తిగా పరిశీలిస్తామని వెల్లడి
అమెరికా అంతర్జాతీయ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్‌ను తిరిగి ప్రారంభించనుంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా అమెరికా పలు సూచనలు చేసింది. విద్యార్థులతో సహా పలు విభాగాల వీసాదారులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో ప్రైవసీ సెట్టింగ్స్‌ను పబ్లిక్ చేయాలని సూచించింది.

అమెరికా జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వారితో పాటు దేశంలోకి ప్రవేశించేందుకు అర్హత లేని వారిని గుర్తించేందుకు వీసా స్క్రీనింగ్, వెట్టింగ్‌లో తమ వద్ద అందుబాటులో ఉన్న మొత్తం సమాచారాన్ని ఉపయోగిస్తామని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది.

కొత్త నిబంధనల ప్రకారం విద్యార్థి, పర్యటన వీసాదారుల ఆన్‌లైన్ కార్యకలాపాలను పూర్తిగా పరిశీలిస్తామని, కావున దరఖాస్తుదారులు అందరూ తమ సోషల్ మీడియా ప్రొఫైళ్లను పబ్లిక్‌గా మార్చుకోవాలని ఆదేశించింది. త్వరలోనే ఎఫ్ఎంజే వర్గాల వీసాల షెడ్యూలింగ్‌ను పునరుద్ధరిస్తామని, అప్‌డేట్‌ల కోసం సంబంధిత ఎంబసీ లేదా కాన్సులేట్ వెబ్‌సైట్‌లను చెక్ చేసుకోవాలని సూచించింది.

విద్యార్థి లేదా పర్యాటక వీసాలపై వచ్చే వారు మాదకద్రవ్యాలు తీసుకోవడం లేదా అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే భవిష్యత్తులో వీసాకు అనర్హులవుతారని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఇటీవల హెచ్చరించింది. వీసా అనేది ఒక ప్రత్యేక అనుమతి మాత్రమేనని, అది హక్కు కాదని తెలిపింది. వీసా జారీ చేసిన తర్వాత కూడా స్క్రీనింగ్ ఉంటుందని, ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే అధికారులు ఆ వీసాలను రద్దు చేసే అవకాశం ఉంటుందని గతంలోనే స్పష్టం చేసింది. 


More Telugu News