జీహెచ్ఎంసీలో 27 మంది అధికారుల బదిలీలు

  • జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో భారీగా బదిలీలు
  • వీరిలో 13 మంది ఏసీపీలు, 14 మంది సెక్షన్‌ ఆఫీసర్లు
  • పారదర్శకత పెంచడం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో చర్యలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో కమిషనర్ ఆర్వీ కర్ణన్ భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం, కొందరు అధికారులు ఏసీబీకి చిక్కడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 27 మంది అధికారులను బదిలీ చేస్తూ ఈరోజు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ మార్పుల్లో భాగంగా 13 మంది అసిస్టెంట్‌ సిటీ ప్లానర్లు (ఏసీపీ), 14 మంది సెక్షన్‌ ఆఫీసర్లను (ఎస్‌ఓ) బదిలీ చేశారు. కొన్ని ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో పాటు, పనితీరు ఆధారంగా కొందరికి పదోన్నతులు కూడా కల్పించారు. మెహిదీపట్నం ఏసీపీగా ఉన్న కృష్ణమూర్తిని ఉప్పల్‌కు, కార్వాన్‌ ఏసీపీ పావనిని సికింద్రాబాద్‌కు బదిలీ చేశారు. చాంద్రాయణట్ట సెక్షన్‌ ఆఫీసర్‌గా ఉన్న సుధాకర్‌కు ఏసీపీగా పదోన్నతి కల్పించి అక్కడే నియమించారు.

టౌన్‌ ప్లానింగ్‌ విభాగంపై ప్రజావాణిలో అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ బదిలీలతో పారదర్శకత పెరిగి, ప్రజల సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని అధికారులు భావిస్తున్నారు. కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్వయంగా బదిలీ ఉత్తర్వులను అధికారులకు అందజేశారు. 


More Telugu News