Chandrababu: యోగా డే ఘన విజయంపై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు అభినందనలు

Chandrababu Naidu Reviews Successful Yoga Day Celebrations
  • విశాఖ కలెక్టరేట్‌లో మంత్రులు, అధికారులతో చంద్ర‌బాబు సమావేశం
  • ప్రపంచ రికార్డుల సాధనపై సిబ్బందికి సీఎం అభినందనలు
  • ప్రజల భాగస్వామ్యంతోనే విజయమన్న ముఖ్యమంత్రి
  • విశాఖలో 3 లక్షల మందికి పైగా యోగా సాధన
  • క్యూఆర్ కోడ్ స్కానింగ్‌తో పక్కాగా హాజరు లెక్కింపు
రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా విశాఖపట్నంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో యోగా దినోత్సవం జరిగిన తీరుపై ఈ సమావేశంలో చర్చించారు.

యోగా దినోత్సవం ఇంతటి ఘన విజయం సాధించడం పట్ల సీఎం చంద్ర‌బాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సహకారం, వారి క్రియాశీల భాగస్వామ్యం, అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో ఇది గొప్ప ముందడుగు అని ఆయన వ్యాఖ్యానించారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయడంలోనూ, పలు ప్రపంచ రికార్డులు సాధించడంలోనూ కీలక పాత్ర పోషించిన మంత్రులు, శాసనసభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించి కార్యక్రమాలను విజయవంతం చేసిన తీరును ఆయన ప్రశంసించారు.

యోగా దినోత్సవం రోజున అర్ధరాత్రి 2 గంటల నుంచే ప్రజలు కార్యక్రమ స్థలాలకు తరలిరావడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా విశాఖపట్నంలో నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో 3 లక్షల మందికి పైగా ప్రజలు ఉత్సాహంగా యోగా సాధనలో పాల్గొనడంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. 

కార్యక్రమంలో పాల్గొన్న వారి సంఖ్యను కచ్చితంగా లెక్కించేందుకు ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానం అద్భుతమైన ఫలితాలను ఇచ్చిందని మంత్రులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో హాజరు లెక్కింపు పక్కాగా జరిగిందని వారు తెలిపారు.
Chandrababu
International Yoga Day
Yoga Day
Visakhapatnam
Andhra Pradesh
Yoga
World Records
AP Government
Public Participation
QR Code Scanning

More Telugu News