రచ్చకెక్కిన కుటుంబ వివాదం... కళానిధి మారన్ కు దయానిధి మారన్ లీగల్ నోటీసులు

  • మనీలాండరింగ్, మోసపూరిత కార్యకలాపాల ఆరోపణలు
  • మరో ఏడుగురికి కూడా నోటీసులు జారీ
  • ఎస్‌ఎఫ్‌ఐఓ దర్యాప్తు కోరనున్న దయానిధి
సన్‌టీవీ ఛైర్మన్ కళానిధి మారన్‌కు, ఆయన సోదరుడు, కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ అయిన దయానిధి మారన్ లీగల్ నోటీసులు పంపడంతో మారన్ కుటుంబంలోని వివాదాలు బహిర్గతమయ్యాయి. కళానిధి మారన్‌తో పాటు ఆయన భార్య కావేరి మారన్ సహా మరో ఆరుగురికి ఈ నోటీసులు అందినట్లు సమాచారం. కళానిధి మారన్ మనీలాండరింగ్‌తో పాటు పలు మోసపూరిత ఆర్థిక కార్యకలాపాలకు పాల్పడ్డారని దయానిధి మారన్ ఆ నోటీసుల్లో తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ మేరకు దయానిధి మారన్ తరఫు న్యాయవాది సురేశ్ ఈ నెల 10న ఈ నోటీసులను జారీ చేసినట్లు ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి. కంపెనీలో వాటాల పంపకాన్ని 2003 నాటి స్థితికి తీసుకురావాలని కూడా దయానిధి మారన్ డిమాండ్ చేసినట్లు తెలిసింది. కళానిధి మారన్ పాల్పడినట్లు ఆరోపిస్తున్న తీవ్రమైన ఆర్థిక నేరాలపై చర్యలు తీసుకోవాలని తీవ్ర నేరాల దర్యాప్తు కార్యాలయాన్ని (ఎస్‌ఎఫ్‌ఐఓ) కూడా దయానిధి మారన్ కోరనున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు.

అయితే, ఈ వివాదం పూర్తిగా వ్యక్తిగతమని, దీని ప్రభావం సన్‌టీవీ గ్రూప్ కార్యకలాపాలపై ఏమాత్రం ఉండబోదని విశ్వసనీయ వర్గాలు ఒక వార్తా సంస్థకు తెలిపినట్లు సమాచారం. ఈ పరిణామం తమిళనాడు రాజకీయ, వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 


More Telugu News