FASTag: వాహ‌న‌దారుల‌కు తీపికబురు.. కేంద్రం కీలక ప్రకటన!

Nitin Gadkari Announces FASTag Annual Pass Available August 15

  • కేంద్రం నుంచి ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ ప్రకటన
  • ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నుంచి అమలు
  • వార్షిక పాస్ ధర రూ.3000గా ఖరారు
  • ఏడాది లేదా 200 ట్రిప్పుల వరకు చెల్లుబాటు
  • కార్లు, జీపులు, వ్యాన్ల వంటి నాన్-కమర్షియల్ వాహనాలకు వర్తింపు
  • త్వరలో యాక్టివేషన్ లింక్ అందుబాటులోకి

జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఫాస్టాగ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా వార్షిక పాస్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది ప్రైవేటు వాహనదారులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. ముఖ్యంగా తరచూ జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి ఈ పాస్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు.

కేవలం రూ. 3వేల‌కే ఫాస్టాగ్ వార్షిక పాస్‌
ఈ నూతన ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. ఈ వార్షిక పాస్ పొందాలనుకునేవారు రూ.3000 చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఈ పాస్ యాక్టివేట్ చేసుకున్న నాటి నుంచి ఏడాది పాటు లేదా 200 ట్రిప్పుల వరకు చెల్లుబాటు అవుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ రెండింటిలో ఏది ముందుగా పూర్తయితే, అప్పటితో పాస్ గడువు ముగుస్తుంది. ప్రస్తుతం ఈ సౌకర్యం కార్లు, జీపులు, వ్యాన్‌ల వంటి వాణిజ్యేతర (నాన్-కమర్షియల్) వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని గడ్కరీ తన పోస్ట్‌లో వివరించారు.

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జాతీయ రహదారులపై ఈ వార్షిక పాస్ చెల్లుబాటు అవుతుందని కేంద్రమంత్రి తెలిపారు. పాస్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి త్వరలోనే ఒక ప్రత్యేక లింక్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన చెప్పారు. ఈ లింక్ 'రాజ్‌మార్గ్‌' యాప్‌తో పాటు ఎన్‌హెచ్‌ఏఐ (భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ), ఎంఓఆర్‌టీహెచ్ (రహదారి రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ) అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు.

ప్రయాణికుల నుంచి చాలాకాలంగా వస్తున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ వార్షిక పాస్‌ను ప్రవేశపెడుతున్నట్లు గడ్కరీ తెలిపారు. ఈ నిర్ణయం వల్ల టోల్‌ప్లాజాల వద్ద రద్దీ తగ్గడమే కాకుండా టోల్ రుసుముకు సంబంధించిన వివాదాలు కూడా తగ్గుముఖం పడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. లక్షలాది మంది ప్రైవేటు వాహన యజమానులకు ఇది మరింత సౌకర్యవంతమైన, సులభతరమైన ప్రయాణ అనుభూతిని అందిస్తుందని మంత్రి నితిన్ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు.

FASTag
Nitin Gadkari
FASTag annual pass
National Highways Authority of India
NHAI
Ministry of Road Transport and Highways
MoRTH
toll tax
Rajmarg app
toll plaza
  • Loading...

More Telugu News