భర్తను వేటకొడవలితో నరుకుతుంటే పారిపోయిన సోనమ్.. చనిపోయాకే తిరిగొచ్చింది!

  • హనీమూన్‌కు తీసుకెళ్లి భర్తను హత్య చేయించిన భార్య సోనమ్ రఘువంశీ
  • ప్రియుడు రాజ్ కుష్వాహా, మరో ముగ్గురు కిరాయి హంతకులతో కలిసి దారుణం
  • మేఘాలయలో క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం 
  • ఘటనలో వాడిన రెండో వేటకొడవలిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజా రఘువంశీ హత్య కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. కిరాయి హంతకులు భర్తను వేటకొడవళ్లతో నరుకుతున్నప్పుడు అక్కడి నుంచి పారిపోయిన సోనమ్ రఘువంశీ.. అతడు చనిపోయిన తర్వాతే అక్కడికి వచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు నిన్న సోనమ్ సహా నిందితులందరినీ షిల్లాంగ్‌కు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోహ్రాకు తీసుకెళ్లి నేరం జరిగిన తీరును పునఃసృష్టించారు (క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్). ఈ సందర్భంగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

పోలీసుల కథనం ప్రకారం.. కిరాయి హంతకుల్లో ఒకడైన విశాల్ సింగ్ చౌహాన్, రాజాపై మొదట వేటకొడవలితో దాడి చేశాడు. రాజాకు తీవ్ర రక్తస్రావం కావడంతోపాటు నొప్పితో కేకలు వేయడం మొదలుపెట్టగానే సోనమ్ అక్కడి నుంచి పారిపోయింది. క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలోనే రాజా హత్యకు ఉపయోగించిన రెండో వేటకొడవలిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజా మృతదేహం, మొదటి వేటకొడవలి దొరికిన రియాట్ అర్లియాంగ్‌లోని వెయ్ సావ్‌డాంగ్ పార్కింగ్ లాట్ కింద ఉన్న లోయలోనే ఈ రెండో ఆయుధాన్ని కూడా కనుగొన్నారు. తొలుత ఒకే ఆయుధంతో హత్య జరిగిందని భావించినప్పటికీ, క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ తర్వాత రెండో ఆయుధం వాడినట్లు నిర్ధారణ అయింది.

ఈ దారుణ ఘటనపై సోనమ్ సోదరుడు గోవింద్ స్పందిస్తూ.. తమ కుటుంబానికి సోనమ్‌తో ఇకపై ఎలాంటి సంబంధాలు లేవని ప్రకటించారు. రాజా కుటుంబానికి న్యాయం జరిగే పోరాటంలో తాము అండగా ఉంటామని, ఈ ఘటన తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన అన్నారు.  


More Telugu News