KA Paul: ప్రభుత్వం స్పందించకపోతే నేనే రంగంలోకి దిగుతా: కేఏ పాల్

KA Paul Reacts to Kuppam Incident Warns Government Action
  • కుప్పం మహిళ ఘటనపై కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం
  • బాధితురాలిని కొట్టిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్
  • ప్రభుత్వం సరిగా స్పందించకుంటే తానే రంగంలోకి దిగుతానని హెచ్చరిక
చిత్తూరు జిల్లా కుప్పంలో చోటుచేసుకున్న అమానుష ఘటన, ఓ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఉదంతంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే తానే రంగంలోకి దిగుతానని ఆయన హెచ్చరించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాను లేఖ రాశానని... తన లేఖకు వారం రోజుల్లోగా రిప్లై ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక విషయంలో చంద్రబాబును అభినందిస్తున్నానని... మహిళను కట్టేసి కొట్టిన విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు స్పందించారని ప్రశంసించారు.

కుప్పం ఘటనలో బాధితురాలిని కొట్టిన వ్యక్తులపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే శాశ్వత పరిష్కారాలు అవసరమని పాల్ నొక్కిచెప్పారు. "ఇలాంటి విషయాలు ఎన్నో జరుగుతున్నాయి. మరోసారి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే అసెంబ్లీలో బిల్లు పెట్టాలి. ప్రభుత్వం సరైన చర్య తీసుకోకపోతే నేనే రంగంలోకి దిగుతా" అని పాల్ ప్రకటించారు.

అప్పులిచ్చి వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల తరహాలో ఇక్కడ కూడా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు. "అప్పులిచ్చి మహిళలను కొట్టి, వారి ఆడపిల్లలను ఎత్తుకెళ్లి అప్పులు వసూలు చేసుకుంటున్నారు. ఇది ఎంత దారుణం? అలా వసూలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వారికి రూ. 5 లక్షల జరిమానా, 5 ఏళ్ల జైలు శిక్ష విధించాలి. అటువంటి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని సీఎం చంద్రబాబును కోరుతున్నాను" అని పాల్ తెలిపారు.

ఈ సందర్భంగా కేఏ పాల్, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇచ్చిన హామీలు, ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడా అమలు కాలేదని విమర్శించారు. "సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ఏడవడం చూశాం, బయట కూడా చూశాం. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది. సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడ అమలుపరిచారు?" అని ఆయన నిలదీశారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం రూ. 5 లక్షల కోట్ల అప్పులు చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం మరో రూ. 5 లక్షల కోట్లు అప్పు చేసిందని, అయినా సూపర్ సిక్స్ అమలుపరిచామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా కావాలని పాల్ అన్నారు. ప్రత్యేక హోదా వల్ల ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని... రాష్ట్రానికి రూ. 10 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. రైతులకు, మహిళలకు మంచి జరుగుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఒక లక్ష 50 వేల కోట్లు ఇస్తేనే సూపర్ సిక్స్ అమలు చేయగలమని అన్నారు. జగన్ కు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని... రాష్ట్రంలో ప్రతిపక్షం తానేనని... అందుకే ప్రజల గొంతుగా ప్రశ్నిస్తానని చెప్పారు.
KA Paul
K A Paul
K. A. Paul
Praja Shanti Party
Kuppam Incident
Chittoor District
Chandrababu Naidu
Andhra Pradesh
Super Six Schemes
Debt Harassment

More Telugu News