Kedarnath Yatra: క్యూ తప్పించుకునేందుకు... కేదార్ నాథ్ యాత్రికుల ఎత్తుగడ!

Kedarnath Pilgrims Use Ambulance to Skip Queues
  • కేదార్‌నాథ్ యాత్రలో అంబులెన్స్‌ల దుర్వినియోగం
  • క్యూ దాటవేయడానికి యాత్రికుల అడ్డదారి ప్రయతనం
  • సోన్‌ప్రయాగ్ వద్ద పోలీసులకు చిక్కిన రెండు అంబులెన్స్‌లు
  • డ్రైవర్లు తమకేమీ తెలియదని, యాజమాన్యం చెప్పినట్టే చేశామన్న వాదన
  • చలాన్లు విధించి, వాహనాలను సీజ్ చేసిన పోలీసులు
  • వైద్య అవసరం లేకున్నా గౌరీకుండ్ వైపు వెళ్లడంతో అనుమానం
పవిత్ర కేదార్‌నాథ్ యాత్రలో కొందరు యాత్రికులు నిబంధనలను గాలికొదిలేసి, అత్యవసర సేవలైన అంబులెన్స్‌లను అక్రమంగా వినియోగిస్తున్న ఘటన కలకలం రేపింది. సోన్‌ప్రయాగ్ వద్ద భారీ క్యూలైన్లను తప్పించుకుని, గౌరీకుండ్ త్వరగా చేరుకోవాలనే దురాశతో కొందరు ఈ అడ్డదారిని ఎంచుకుంటున్నారు. ఈ వ్యవహారం యాత్ర నిర్వహణలో నియమాల ఉల్లంఘనను స్పష్టం చేస్తోంది.

వివరాల్లోకి వెళితే, శనివారం సోన్‌ప్రయాగ్ వద్ద విధుల్లో ఉన్న పోలీసులకు రెండు అంబులెన్స్‌లు అనుమానాస్పదంగా కనిపించాయి. పెద్దగా సైరన్లు మోగిస్తూ, బీకాన్ లైట్లతో అవి గౌరీకుండ్ వైపు దూసుకెళ్తున్నాయి. సాధారణంగా కేదార్‌నాథ్ ఆలయానికి 16 కిలోమీటర్ల ట్రెక్కింగ్‌కు గౌరీకుండ్ చివరి వాహన ప్రయాణ కేంద్రం. అయితే, ఆ రోజు ఎలాంటి వైద్య అత్యవసర పరిస్థితి సమాచారం లేకపోవడం, రోగులను చేర్పించడానికి గౌరీకుండ్‌లో పెద్ద ఆసుపత్రులు లేకపోవడంతో పోలీసులకు అనుమానం బలపడింది.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఆక్రో వంతెన వద్ద అంబులెన్స్‌లను ఆపి తనిఖీ చేశారు. లోపల ఎలాంటి స్ట్రెచర్లు, గాయపడినవారు గానీ లేరు. బదులుగా, సాధారణ యాత్రికుల దుస్తుల్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఆరోగ్యంగా కనిపించారు. "నిజంగా అనారోగ్యం ఉంటే సోన్‌ప్రయాగ్ లేదా రుద్రప్రయాగ్ వైపు వెళ్లాలి కానీ, ట్రెక్ మార్గం మొదలయ్యే గౌరీకుండ్ వైపు ఎందుకు వస్తారు?" అని ఓ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు.

డ్రైవర్లు, హరిద్వార్‌కు చెందిన నిఖిల్ విల్సన్ మస్సీ, అమ్రోహాకు చెందిన కృష్ణ కుమార్‌లను విచారించగా, ఈ వాహనాలను వైద్య సహాయం కోసం కాకుండా, కేవలం సౌకర్యం కోసం అద్దెకు తీసుకున్నారని తేలింది. ఒక ఏసీ అంబులెన్స్‌ను ఒకే యాత్రికుడు బుక్ చేసుకోగా, మరోదానిలో ఇద్దరు ప్రయాణిస్తున్నారు. హరిద్వార్ నుండే వీరు ప్రయాణికులను ఎక్కించుకున్నట్లు సమాచారం. సోన్‌ప్రయాగ్ నుండి గౌరీకుండ్ మధ్య దూరం కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే.

పోలీసుల తనిఖీ గమనించిన యాత్రికులు జనసమూహంలోకి పారిపోయారు. పోలీసులు ఇద్దరు డ్రైవర్లకు చలాన్లు విధించి, మోటారు వాహన చట్టం కింద వాహనాలను సీజ్ చేశారు. అయితే, వాహన యజమానులు చెప్పినట్టే తాము చేశామని, డబ్బు వ్యవహారాలతో తమకు సంబంధం లేదని డ్రైవర్లు వాపోయారు. ఈ ఘటన యాత్రలో కొందరు ప్రదర్శిస్తున్న నిబంధనల ఉల్లంఘన ధోరణిని స్పష్టం చేస్తోంది.
Kedarnath Yatra
Kedarnath
Sonprayag
Gaurikund
Ambulance
Yatra
Trekking
Rule violation
Pilgrims
Rudrapryag

More Telugu News