Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వరుస ఘటనలతో భయాందోళన.. అహ్మదాబాద్-లండన్ ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం

Air India Ahmedabad to London Flight Faces Technical Issue
Advertisement
  • అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం రద్దు
  • టేకాఫ్‌కు ముందు సాంకేతిక సమస్యను గుర్తించిన అధికారులు
  • జూన్ 12 నాటి ఘోర ప్రమాదం తర్వాత అదే రూట్‌లో తొలి విమానం ఇదే
  • ఎయిరిండియా విమానాల్లో వరుస సాంకేతిక సమస్యలతో ప్రయాణికుల ఆందోళన
Advertisement
ఎయిరిండియా విమానాల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా, అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరాల్సిన మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆ విమాన సర్వీసును రద్దు చేశారు. గత వారం ఇదే మార్గంలో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన మరువకముందే, మళ్ళీ అదే మార్గంలో వెళ్లే విమానానికి సాంకేతిక సమస్య తలెత్తడం గమనార్హం.

ఈ మధ్యాహ్నం 1.10 గంటలకు అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరాల్సిన ఎయిరిండియాకు చెందిన ఏఐ-159 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానంలో సాంకేతిక సమస్య ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విమానం గాల్లోకి ఎగరడానికి ముందు నిర్వహించిన సాధారణ తనిఖీల్లో ఈ లోపం వెలుగుచూసింది. దీంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమాన సర్వీసును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది.

ఈ నెల జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలి దగ్ధమైన విషయం తెలిసిందే. ఆ ఘోర దుర్ఘటనలో ఒక్కరు మినహా విమానంలో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందారు. ఈ విమానం డాక్టర్స్ హాస్టల్‌పై కూలడంతో మరికొంతమంది ఇతరులు మృతి చెందారు.

ఈ విషాద ఘటన అనంతరం, ఎయిరిండియా ఏఐ-171 ఫ్లైట్ నంబర్‌ను నిలిపివేసి, దాని స్థానంలో ఏఐ-159 నంబరుతో సర్వీసులను నడపాలని నిర్ణయించింది. కాగా, ఆ ప్రమాదం తర్వాత లండన్‌కు షెడ్యూల్ చేయబడిన తొలి విమానం ఇదే కావడం, ఇప్పుడు అదే సిరీస్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Advertisement
Advertisement
Air India
Air India flight
Ahmedabad London
Technical issue
AI-159

More Telugu News