Middle East flights: ఇజ్రాయెల్– ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఎగరని విమానాలు

Israel Iran Conflict Middle East Flights Suspended
  • ఇరాన్ గగనతలం పూర్తిగా మూసివేత
  • లెబనాన్, జోర్డాన్, ఇరాక్‌లలో విమానాల రాకపోకలు బంద్
  • వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే పడిగాపులు
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో పశ్చిమాసియాలోని పలు దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. ఇజ్రాయెల్ నుంచి క్షిపణి దాడుల ముప్పు పొంచి ఉండటంతో ఇరాన్ తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే బాటలో లెబనాన్, జోర్డాన్, ఇరాక్ దేశాలు కూడా విమానాల రాకపోకలను నిలిపివేశాయి. దీంతో పశ్చిమాసియా వ్యాప్తంగా విమానాశ్రయాలు మూతపడగా.. సుమారు 10,000 మందికి పైగా ప్రయాణికులు చిక్కుకుపోయారని విమానయాన భద్రతా నిపుణుడు, రిటైర్డ్ పైలట్ జాన్ కాక్స్ తెలిపారు.

టెహ్రాన్ శివార్లలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయమైన ఖొమేనీలో అధికారులు విమాన సర్వీసులను నిలిపివేశారు. ఇజ్రాయెల్ కూడా తమ దేశంలోని కీలకమైన బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేసింది. ఈ పరిణామాల వల్ల సుమారు 50,000 మందికి పైగా ఇజ్రాయెల్ ప్రయాణికులు విదేశాల్లో చిక్కుకుపోయినట్లు సమాచారం.

ఇరాన్ దాడుల నేపథ్యంలో దేశంలోని మూడు విమానయాన సంస్థలు తమ విమానాలను లార్నాకాకు తరలించాయి. ఇజ్రాయెల్ పౌరులు జోర్డాన్, ఈజిప్ట్‌లతో ఉన్న సరిహద్దుల ద్వారా దేశం విడిచి వెళ్లవద్దని, ఆ ప్రాంతాల్లో ప్రమాదం పొంచి ఉందని ప్రధాని నెతన్యాహు హెచ్చరికలు జారీ చేశారు. లెబనాన్, జోర్డాన్‌లలో గగనతలాలు పాక్షికంగా తెరిచి ఉన్నప్పటికీ, విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు తెలిపారు. అనేక విమానాలు రద్దు కావడంతో స్థానికులు, ఇతర దేశస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Middle East flights
Israel Iran conflict
Iran
Israel
flight ban
airport closures
Netanyahu
Ben Gurion Airport
Khomeni Airport
flight disruptions

More Telugu News