Nadendla Manohar: ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కు రూ.10 లక్షల విరాళం ప్రకటించిన మంత్రి నాదెండ్ల

Nadendla Manohar Donates 1 Million Rupees to Flat Factory Complex
  • కొలకలూరులో సెర్ప్ ఆధ్వర్యంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటు
  • కోటి రూపాయల విలువైన భూమిని విరాళంగా ఇచ్చిన పొన్నెకంటి కుటుంబం
  • ప్రభుత్వంపై ప్రజలకు పెరుగుతున్న నమ్మకానికి ఇది నిదర్శనమన్న మంత్రి మనోహర్ 
తెనాలి మండలం కొలకలూరు గ్రామ పంచాయతీలో సెర్ప్ ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (సెర్ప్-ఎంఎస్ఎంఈ) అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తన కుటుంబం తరపున 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా, ముఖ్యంగా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి, వారి ఆర్థిక స్వావలంబనకు బాటలు వేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు.

సోమవారం నాడు తెనాలిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. కొలకలూరు గ్రామానికి చెందిన పొన్నెకంటి సువర్చల శశికిరణ్ కుటుంబ సభ్యులు తమ పొన్నెకంటి పోతురాజు ట్రస్ట్ పేరు మీద సుమారు కోటి రూపాయలు విలువ చేసే ఎకరం భూమిని ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వానికి విరాళంగా అందజేశారు. ఈ భూమిని సెర్ప్ అధికారులకు మంత్రి మనోహర్ సమక్షంలో అప్పగించారు. ఈ సందర్భంగా దాతల సేవా నిరతిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

అనంతరం మంత్రి మనోహర్ మాట్లాడుతూ, కొలకలూరు గ్రామాభివృద్ధికి తమ కుటుంబం తరపున ఈ చిన్న చేయూత (రూ.10 లక్షలు) అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెరుగుతోందనడానికి ఇటువంటి భూదానాలు, విరాళాలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ద్వారా కేవలం ఉపాధి మాత్రమే కాకుండా, అవసరమైన నైపుణ్య శిక్షణ కూడా అందించి, తయారైన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించి ఎగుమతులను ప్రోత్సహిస్తామని మంత్రి వివరించారు. కొలకలూరును రాష్ట్రంలోనే ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ శ్రీమతి సంజనా సింహ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Nadendla Manohar
Flat Factory Complex
Tenali
Kolakaluru
SERP
MSME
Andhra Pradesh
Employment Opportunities
Ponnekanti Pothuraju Trust
Land Donation

More Telugu News