Chennuboyina Chittibabu: కేశినేని నాని ఓటుతో... మరో మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న టీడీపీ

TDP Wins Kondapalli Municipality Chairman Election
  • కొండపల్లి మున్సిపాలిటీలో టీడీపీ గెలుపు
  • ఒక్క ఓటుతో టీడీపీ విజయం
  • ఎంపీగా ఉన్నప్పుడు టీడీపీకి ఓటు వేసిన కేశినేని నాని
ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి చెన్నుబోయిన చిట్టిబాబు ఛైర్మన్ గా.... గతంలో ఇండిపెండెంట్‌గా గెలిచి టీడీపీకి మద్దతు ప్రకటించిన శ్రీదేవి వైస్ ఛైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. ఈ విజయంతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

వివరాల్లోకి వెళితే, కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులు ఉన్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ చెరో 14 స్థానాల్లో గెలుపొందగా, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఇండిపెండెంట్‌గా గెలిచిన శ్రీదేవి టీడీపీకి మద్దతు తెలపడంతో ఆ పార్టీ బలం 15కు చేరింది. అదే సమయంలో, అప్పటి వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తన ఎక్స్ అఫిషియో ఓటును వైసీపీకి వేయడంతో ఆ పార్టీ బలం కూడా 15కు సమమైంది.

ఈ తరుణంలో, అప్పటి పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని టీడీపీకి అనుకూలంగా తన ఎక్స్ అఫిషియో ఓటును వినియోగించుకున్నారు. అయితే, ఈ ఓటు చెల్లుబాటుపై వైసీపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, 2021లో కేశినేని నాని వేసిన ఎక్స్ అఫిషియో ఓటు చెల్లుతుందని స్పష్టం చేస్తూ సీల్డ్ కవర్‌లో ఆదేశాలు జారీ చేసింది. దీంతో టీడీపీ బలం 16కు పెరిగింది.

ఈ క్రమంలో ఈరోజు భారీ బందోబస్తు మధ్య సీల్డ్ కవర్ ను తెరిచి అధికారులు ఫలితాలను ప్రకటించారు. చెన్నుబోయిన చిట్టిబాబు కొండపల్లి మున్సిపల్ చైర్మన్‌గా, శ్రీదేవి వైస్ చైర్మన్‌గా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. కీలకమైన మున్సిపాలిటీని టీడీపీ దక్కించుకోవడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ విజయోత్సవాలు జరుపుకున్నారు.

Chennuboyina Chittibabu
Kondapalli Municipality
TDP
Andhra Pradesh local body elections
Sridevi
Kesineni Nani
Vasantha Krishna Prasad
NTR district

More Telugu News