Aamir Khan: ఉగ్రవాదానికి మతం ఆపాదించవద్దు.. ఇస్లాం హింసను ప్రోత్సహించదు: ఆమిర్‌ఖాన్

Aamir Khan Reacts to Pahalgam Attack Controversy
  • పహల్గామ్ ఉగ్రదాడిపై ఆలస్యంగా స్పందించిన ఆమిర్‌ఖాన్
  • సినిమా ప్రచారం కోసమేనన్న ఆరోపణలను తోసిపుచ్చిన నటుడు
  • సోషల్ మీడియాలో చురుగ్గా లేకపోవడమే జాప్యానికి కారణమని వెల్లడి
  • తన దేశభక్తి సినిమాల్లో ప్రతిఫలిస్తుందన్న ఆమిర్
పహల్గామ్‌ ఉగ్రదాడిని ఖండిస్తూ తాను చేసిన ప్రకటన ఆలస్యం కావడంతో వస్తున్న విమర్శలపై బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్‌ఖాన్ స్పందించాడు. ఈ ఘటన జరిగిన దాదాపు వారం రోజుల తర్వాత, తన తదుపరి చిత్రం 'సితారే జమీన్ పర్' ట్రైలర్ విడుదలకు కొన్ని గంటల ముందు ఆయన స్పందించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే తన స్పందనకు, సినిమా ప్రచారానికి ఎలాంటి సంబంధం లేదని ఆమిర్ స్పష్టం చేశాడు.

ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమిర్‌ఖాన్ మాట్లాడుతూ తాను సోషల్ మీడియాలో చురుగ్గా ఉండకపోవడం వల్లే స్పందించడంలో జాప్యం జరిగిందని వివరణ ఇచ్చాడు. ఉగ్రదాడిని ‘క్రూరమైన చర్య‘గా అభివర్ణించిన ఆయన.. మతం పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు (ఉగ్రవాదులు) మతం అడిగి మరీ కాల్పులు జరిపారని, దీనర్థం అక్కడ మీరు లేదంటే నేను కూడా ఉండొచ్చని ఆవేదన వ్యక్తంచేశారు. 

సినిమా ట్రైలర్ విడుదల నేపథ్యంలోనే తాను ఈ వ్యాఖ్యలు చేశానన్న ఆరోపణలను ఆమిర్ ఖండించాడు. ఇది కేవలం యాదృచ్ఛికమన్నాడు. నిజానికి ఉగ్రదాడి కారణంగానే 'సితారే జమీన్ పర్' ట్రైలర్ విడుదలను వాయిదా వేశామని, అలాగే ఏప్రిల్ 25న థియేటర్లలో తిరిగి విడుదలైన 'అందాజ్ అప్నా అప్నా' సినిమా ప్రీమియర్‌ను కూడా ఆ రోజు రద్దు చేసుకున్నానని చెప్పాడు.

ఈ సందర్భంగా తన మతం గురించి కూడా ఆమిర్ ప్రస్తావించారు. ఇలాంటి దాడులకు పాల్పడే ఉగ్రవాదులను ముస్లింలుగా పరిగణించలేమని అన్నాడు. ఏ మతం కూడా ప్రజలను చంపమని చెప్పదని, అమాయకులైన ఏ వ్యక్తినీ చంపరాదని, మహిళలు లేదా పిల్లలపై దాడి చేయరాదని ఇస్లాంలో స్పష్టంగా ఉందన్నాడు. వారు తమ పనులతో మతానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు కాబట్టి తాను ఈ ఉగ్రవాదులను ముస్లింలుగా భావించనని చెప్పాడు.

తన దేశభక్తి తన సినిమాల్లో ప్రతిఫలిస్తుందని ఆమిర్‌ఖాన్ పేర్కొన్నాడు. తన దేశభక్తి సినిమా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రముఖ నటుడు మనోజ్‌కుమార్ తనను ప్రశంసించారని గుర్తుచేసుకున్నాడు. "నా దేశభక్తి నా పనిలో కనిపిస్తుంది. 'రంగ్ దే బసంతి', 'లగాన్', 'సర్ఫరోష్' చూడండి. నాకంటే ఎక్కువ దేశభక్తి సినిమాలు మరే నటుడూ చేసి ఉండరని నేను అనుకుంటున్నాను" అని ఆమిర్‌ఖాన్ పేర్కొన్నాడు. 

కాగా, ఆమిర్ నటిస్తున్న తదుపరి చిత్రం 'సితారే జమీన్ పర్' ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆయన ఐకానిక్ ఫిల్మ్ 'తారే జమీన్ పర్'కు స్పిరిచ్యువల్ సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాలో జెనీలియా డిసౌజా కూడా నటిస్తున్నారు. ఈ చిత్రం స్పానిష్ సినిమా 'కాంబియోనెస్'కు రీమేక్ అని తెలుస్తోంది. అంతేకాకుండా రజినీకాంత్ నటిస్తున్న 'కూలీ' చిత్రంలో కూడా ఆమిర్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం.
Aamir Khan
Pahalgam Terrorist Attack
Sitare Zameen Par
Islam
Terrorism
Bollywood
Andaz Apna Apna
Patriotism
Rang De Basanti
Coolie Movie

More Telugu News