పొదిలి సీఐపై చిందులు తొక్కిన చెవిరెడ్డి

  • వైసీపీ శ్రేణులతో మాట్లాడేందుకు పొదిలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి
  • చెవిరెడ్డిని అడ్డుకున్న పోలీసులు
  • జగన్ పొదిలి పర్యటనలో నిరసన తెలుపుతున్న మహిళలపై రాళ్లు, చెప్పులతో దాడి
  • మహిళల ఫిర్యాదుతో వైసీపీ శ్రేణులపై పొదిలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు 
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రకాశం జిల్లా పొదిలి సీఐ వెంకటేశ్వర్లుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 11న మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పొదిలి పర్యటన సందర్భంగా రోడ్డు పక్కన నిరసన తెలుపుతున్న మహిళలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు, చెప్పులతో దాడి చేసిన విషయం విదితమే.

ఈ ఘటనలో పోలీసులకు సైతం గాయాలయ్యాయి. ఈ కేసులో నిన్న 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న వైసీపీ ముఖ్య నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి పొదిలి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న నిందితులను కలవడానికి అనుమతి లేదని సీఐ వెంకటేశ్వర్లు అడ్డుకున్నారు.

దీంతో సీఐపై చెవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్‌లో ధర్నా చేస్తానంటూ చెవిరెడ్డి హెచ్చరించారు. ఒక దశలో సీఐ వెంకటేశ్వర్లు పైకి దూసుకువెళ్లగా చెవిరెడ్డిని డీఎస్పీ లక్ష్మీనారాయణ అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. 


More Telugu News