నేను రూ.2 కోట్లు ఇస్తా, మా నాన్నను తిరిగి తీసుకురండి.. విమాన ప్రమాద బాధితురాలి ఆవేదన
- అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితుల కుటుంబాల శోకం
- మృతుల గుర్తింపు కోసం బంధువుల నుంచి డీఎన్ఏ నమూనాల సేకరణ
- 48 నుంచి 72 గంటల్లో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తి అంచనా
- టాటా గ్రూప్ మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ప్రకటన
మృతదేహాల గుర్తింపు కోసం బంధువులు డీఎన్ఏ నమూనాలు ఇస్తుండగా, బీజే మెడికల్ కాలేజీ ప్రాంగణం ఆర్తనాదాలతో నిండిపోయింది. ఆప్తులను కోల్పోయిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సివిల్ ఆసుపత్రి అధికారులు శుక్రవారం నాటికి 219 మంది బంధువుల నుంచి రక్త నమూనాలను సేకరించినట్లు తెలిపారు. వీరిలో కొందరు విదేశీయులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. "చాలా మంది బంధువులు నమూనాలు అందించారు. మృతదేహాల అవశేషాల డీఎన్ఏ విశ్లేషణ కూడా జరుగుతోంది. డీఎన్ఏ సరిపోలిన తర్వాత గుర్తింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగిస్తాం" అని ఓ అధికారి వివరించారు. ఈ డీఎన్ఏ విశ్లేషణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 48 నుంచి 72 గంటల సమయం పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.