TTD: తిరుమల లడ్డూపై సోషల్ మీడియాలో ప్రచారం... టీటీడీ స్పందన

TTD Responds to False Social Media Claims About Tirumala Laddu
  • తిరుమల లడ్డూపై ఆరోపణలు చేసిన నవీన్ కుమార్ కు వైద్య పరీక్షలు చేయించిన టీటీడీ
  • నాలుకను నవీన్ తను కొరుక్కోవడం వల్లనే గాయమైందని తేల్చిన వైద్యులు
  • అసత్యఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన టీటీడీ అధికారులు
తిరుమల లడ్డూ ప్రసాదంపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారంపై టీటీడీ తీవ్రంగా స్పందించింది. తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తి చేసిన ఆరోపణలను టీటీడీ ఖండించింది. తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.

రంగారెడ్డి జిల్లాకు చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తి ఈ నెల 8న తిరుమలలో లడ్డూ ప్రసాదం తింటున్న సమయంలో తన నాలుకకు గాయమైందని ఆరోపిస్తూ, ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం చేశాడు.

ఈ ఆరోపణలపై తక్షణమే స్పందించిన టీటీడీ, సంబంధిత వ్యక్తికి వైద్య సహాయం అందిస్తూ తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించింది. అనంతరం మరింత స్పష్టత కోసం స్విమ్స్ ఆసుపత్రిలో కూడా వైద్య పరీక్షలు చేయించారు. లడ్డూ ప్రసాదంలో ఎటువంటి ఇతర పదార్థాలు లేవని, నవీన్ ఆరోపించిన గాయం తన నాలుకను తానే గట్టిగా కొరుక్కోవడం వల్ల సంభవించిందని వైద్యులు తేల్చారు. ఇది పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన అని వైద్య నిపుణులు స్పష్టం చేశారు.

టీటీడీ నుండి పరిహారం పొందాలనే ఉద్దేశంతో నవీన్ కుమార్ కావాలని లడ్డూ ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశాడని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలతో భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయలేరని, కావాలని ఇలాంటి ఆరోపణలు చేస్తే మాత్రం సహించేది లేదని టీటీడీ అధికారులు హెచ్చరించారు. 
TTD
Tirumala Laddu
Laddu Prasadam
Naveen Kumar
Social Media
TTD Response
Tirumala
Rangareddy
Fake News
TTD News

More Telugu News