Nangthoi Sharma: అమ్మకు చివరి ఫోన్ కాల్.. విమాన ప్రమాదంలో ఇద్దరు మణిపురి ఫ్లైట్ అటెండెంట్ల మృతి

Manipur Air India Flight Attendants Nangthoi Sharma Lamnunthem Singson Die
  • నంగ్థోయ్ శర్మ, లామ్నుంథెమ్ సింగ్‌సన్‌గా గుర్తించిన అధికారులు
  • లండన్ వెళ్తున్నానని చెప్పిన నంగ్థోయ్, అహ్మదాబాద్ డ్యూటీకి లామ్నుంథెమ్
  • జాతి ఘర్షణలతో నిరాశ్రయురాలైన లామ్నుంథెమ్ కుటుంబం
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మణిపూర్‌‌లో తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో ఆ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ప్రతిభావంతులైన యువతులు, ఎయిర్ ఇండియాలో ఫ్లైట్ అటెండెంట్లుగా పనిచేస్తున్న నంగ్థోయ్ శర్మ కొంగ్‌బ్రైలత్‌పమ్ (21), లామ్నుంథెమ్ సింగ్‌సన్ ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త తెలియడంతో వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఇంఫాల్‌లోని డీఎం కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో నంగ్థోయ్ శర్మ ఎంపికయ్యారు. ముగ్గురు ఆడపిల్లల్లో రెండోదైన నంగ్థోయ్, టీనేజ్‌లోనే ఎయిర్ ఇండియాలో ఉద్యోగం సంపాదించి కుటుంబానికి ఆసరాగా నిలిచారు. ఆమె తండ్రి నందేశ్ కుమార్ శర్మ మాట్లాడుతూ "12న ఉదయం 11:30 గంటలకు నంగ్థోయ్ తన సోదరికి చివరిసారిగా ఫోన్ చేసింది. తాను లండన్ వెళ్తున్నానని, కొన్ని రోజులు మాట్లాడలేనని చెప్పింది. జూన్ 15న తిరిగి రావాల్సి ఉంది. అదే మాకు ఆమె చివరి మాటలవుతాయని ఊహించలేదు" అని కన్నీటిపర్యంతమయ్యారు.

ఆమె కాల్ చేసిన మూడు గంటల తర్వాత విమాన ప్రమాదం గురించి ఓ బంధువు ఫోన్‌లో చెప్పడంతో నంగ్థోయ్ సోదరి తీవ్ర ఆందోళనకు గురైంది. గత వారం అరమ్‌బాయ్ టెంగ్‌గోల్ సభ్యుడి అరెస్ట్‌కు నిరసనగా కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో వారికి ఆన్‌లైన్ వార్తలు అందుబాటులో లేవు. నంగ్థోయ్ మొదటి సెమిస్టర్ పరీక్షలు రాసిన వెంటనే స్నేహితులతో కలిసి ఎయిర్ హోస్టెస్ ఇంటర్వ్యూకు హాజరై ఉద్యోగం సాధించిందని, ముంబైలో మణిపూర్‌కు చెందిన ఇతర ఎయిర్ ఇండియా ఉద్యోగినులతో కలిసి ఉండేదని ఆమె తండ్రి గుర్తుచేసుకున్నారు. ఎప్పటికైనా మణిపూర్‌లో స్థిరమైన ఉద్యోగం చేస్తుందని ఆశించామని తెలిపారు.

మరో మృతురాలు లామ్నుంథెమ్ సింగ్‌సన్ కుటుంబం 2023లో జరిగిన జాతి ఘర్షణల కారణంగా ఇంఫాల్‌లోని ఓల్డ్ లంబులేన్‌లో ఉన్న తమ సర్వస్వాన్నీ వదిలేసి వచ్చింది. ప్రస్తుతం వారు కాంగ్‌పోక్పి జిల్లాలో అంతర్గతంగా నిరాశ్రయులైన వ్యక్తులుగా (ఐడీపీలు) ఓ చిన్న అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. లామ్నుంథెమ్ తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించగా, ఆమె తల్లి నెమ్నెయిల్‌హింగ్ సింగ్‌సన్ ముగ్గురు పిల్లలను ఒంటరిగా పెంచారు. లామ్నుంథెమ్ ఆమెకు ఏకైక కుమార్తె. ప్రమాద వార్త తెలిసినప్పటి నుంచి స్థానికులు వారి ఇంటికి చేరుకుని ధైర్యం చెబుతున్నారు. తన కుమార్తె క్షేమంగా ఉందని ఏదైనా అధికారిక సమాచారం వస్తుందేమోనని తల్లి నెమ్నెయిల్‌హింగ్ ఇంకా ఆశతో ఎదురుచూస్తున్నారు. చివరిసారిగా తన తల్లికి ఫోన్ చేసినప్పుడు, తాను డ్యూటీ మీద అహ్మదాబాద్ వెళ్తున్నట్టు లామ్నుంథెమ్ చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు.  
Nangthoi Sharma
Air India crash
Manipur flight attendants
Lamnunthem Singson
Imphal plane accident
flight attendant death
Air India Express
Manipur news
plane crash India
DM College of Commerce

More Telugu News