Odisha Love Marriage: ఒడిశాలో అమానుషం.. ప్రేమ పెళ్లికి 40 మందికి శిరోముండనం

Odisha Love Marriage 40 Men Forced to Shave Heads for Love Marriage
  • ఒడిశాలో వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి
  • గ్రామ కట్టుబాట్ల పేరుతో యువతి కుటుంబాన్ని వెలివేస్తామని పెద్దల హెచ్చరిక
  •  వెలి తప్పించుకోవడానికి 40 మంది కుటుంబ సభ్యుల శిరోముండనం
  •  మేక, గొర్రె, కోడి, పావురాలను బలి ఇచ్చి ప్రత్యేక పూజలు
  •  యువజంటకు 'పెద్దకర్మ' నిర్వహించిన కుటుంబ సభ్యులు
తమ గ్రామానికి చెందిన యువతి వేరొక కులానికి చెందిన యువకుడిని ప్రేమ వివాహం చేసుకోవడం ఆ గ్రామ పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. గ్రామ కట్టుబాట్లను ఉల్లంఘించారంటూ యువతి కుటుంబ సభ్యులకు అమానవీయమైన శిక్ష విధించారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లా, కాశీపూర్‌ సమితి పరిధిలో వెలుగుచూసింది. బాధితులు వెలి శిక్ష నుంచి తప్పించుకునేందుకు కుటుంబంలోని దాదాపు 40 మంది పురుషులు శిరోముండనం చేయించుకోవాల్సి వచ్చింది.

స్థానికుల కథనం ప్రకారం.. కాశీపూర్‌ సమితి గోరఖ్‌పూర్‌ పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి అదే ప్రాంతానికి చెందిన షెడ్యూల్డ్‌ కులానికి చెందిన యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి వివాహానికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో, మూడు రోజుల క్రితం ఆ జంట ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు.

గురువారం నూతన వధూవరులు గ్రామానికి తిరిగి రావడంతో విషయం గ్రామ పెద్దలకు తెలిసింది. గ్రామ సంప్రదాయాలను ఉల్లంఘించి కులాంతర వివాహం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన పెద్దలు, యువతి కుటుంబాన్ని వెలివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ వెలి నుంచి కుటుంబం బయటపడాలంటే కొన్ని కఠినమైన నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా యువతి కుటుంబ సభ్యులు, బంధువుల్లోని పురుషులు శిరోముండనం చేయించుకోవాలని, మూగజీవాలను బలి ఇవ్వాలని, అలాగే నూతన దంపతులకు 'పెద్దకర్మ' (సాధారణంగా మరణించిన వారికి చేసే కార్యక్రమం) నిర్వహించాలని తీర్పునిచ్చారు.

గ్రామ పెద్దల ఆదేశాలతో భయపడిపోయిన యువతి కుటుంబ సభ్యులు, వారి బంధువులు సుమారు 40 మంది పురుషులు గుండు గీయించుకున్నారు. అనంతరం మేక, గొర్రె, కోడి, పావురాలను బలి ఇచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. బతికున్న తమ కుమార్తె, అల్లుడికి 'పెద్దకర్మ' కూడా జరిపించడం పలువురిని కలిచివేసింది. ఈ అమానవీయ ఘటనపై స్థానిక పోలీసులను వివరణ కోరగా, తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఘటన గురించి సమాచారం లేదని వారు తెలిపారు.
Odisha Love Marriage
Rayagada district
Inter caste marriage
Kashipur
forced tonsure
village elders
social boycott
tribal community
Andhra Pradesh news

More Telugu News