పంజాబ్ నుంచి యూకేకి బుల్లెట్ బండి, ఫర్నిచర్.. రూ.4.5 లక్షలు ఖర్చుపెట్టిన ఫ్యామిలీ!

  • ఇటీవ‌ల యూకేకి మారిన పంజాబీ కుటుంబం 
  • కర్తార్‌పూర్ నుంచి వోల్వర్‌హాంప్టన్‌కు బుల్లెట్, ఫర్నిచర్
  • రూ.4.5 లక్షలకు పైగా రవాణా ఖర్చు
  • షిప్పింగ్‌కు 40 రోజులు పట్టిన వైనం
  • స్వస్థలం జ్ఞాపకాలను పదిలపరుచుకునేందుకే ఈ ప్రయత్నం
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
భారత్‌ నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న యూకేకు శాశ్వతంగా మకాం మార్చినా తమ మూలాలను, సంస్కృతిని మర్చిపోలేని ఓ పంజాబీ కుటుంబం చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబ్‌లోని కర్తార్‌పూర్ నుంచి తమ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటార్‌సైకిల్‌తో పాటు, ప్రత్యేకంగా తయారుచేయించుకున్న ఇంటి ఫర్నిచర్‌ను యూకేలోని వోల్వర్‌హాంప్టన్‌లో ఉన్న వారి కొత్త ఇంటికి తరలించారు. ఇందుకోసం వారు సుమారు రూ.4.5 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం.

ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతుండ‌గా... వీడియోలో ఇంటి బయట కంటైనర్ ట్రక్కు నుంచి సామాన్లను అన్‌లోడ్ చేయడం కనిపిస్తుంది. మొదట పంజాబ్ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌తో ఉన్న నల్లటి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ను జాగ్రత్తగా దించారు. ఆ తర్వాత సోఫా సెట్, డైనింగ్ టేబుల్, వింగ్ చైర్లు, పడకలు వంటి విలాసవంతమైన ఫర్నిచర్‌ను కూడా దించడం మ‌నం వీడియోలో చూడవచ్చు.

బైక్ యజమాని అయిన రాజ్‌గురు ఈ విషయంపై స్పందిస్తూ... ఈ వస్తువులను షిప్పింగ్ చేసి, డెలివరీ చేయడానికి మొత్తం 40 రోజులు పట్టిందని తెలిపారు. ఈ ఫర్నిచర్ అంతా తమ స్వస్థలమైన కర్తార్‌పూర్‌లో ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకున్నామని, అక్కడి హస్తకళా నైపుణ్యం చాలా గొప్పదని ఆయన వివరించారు. యూకేలో శాశ్వతంగా స్థిరపడుతున్నందున తమ ఇంటికి సంబంధించిన కొంత భాగాన్ని, జ్ఞాపకాలను తమతో పాటు తీసుకురావాలనేది తమ కుటుంబం కోరిక అని ఆయన పేర్కొన్నారు.

దీంతో తమ జ్ఞాపకాలను, సాంస్కృతిక గుర్తింపును కాపాడుకోవడానికి ఈ కుటుంబం చూపిన నిబద్ధతను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. "అన్నీ తాత్కాలికమే.. కానీ బుల్లెట్ శాశ్వతం" అని ఒకరు కామెంట్ చేయగా, "సోదరుడు తన ఇంటిని తన ఇంటికి తెచ్చుకున్నాడు" అని మరొకరు వ్యాఖ్యానించారు. 


More Telugu News