KCR: కేసీఆర్ ను 50 నిమిషాల పాటు విచారించిన కాళేశ్వరం కమిషన్

- పార్టీ నేతలతో కలిసి బీఆర్కే భవన్ కు వచ్చిన బీఆర్ఎస్ అధినేత
- అనారోగ్యం కారణంగా ఇన్ కెమెరా విచారణను ఎంచుకున్న మాజీ సీఎం
- కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఫైల్ ఇచ్చిన కేసీఆర్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ సుమారు 50 నిమిషాల పాటు విచారించింది. ఈ రోజు మధ్యాహ్నం హరీశ్ రావుతో పాటు పార్టీ సీనీయర్ నేతలతో కలిసి కేసీఆర్ బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. స్వల్ప అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ ఇన్ కెమెరా విచారణను కేసీఆర్ ఎంచుకున్నారు. దీంతో ఓపెన్ కోర్టులో ఉన్న వారందరినీ అధికారులు బయటకు పంపించారు. అనంతరం జస్టిస్ పీసీ ఘోష్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు. ప్రాజెక్టు రీ ఇంజినీరింగ్, ఆనకట్టల నిర్మాణం, ఒప్పందాలు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, నీటి నిల్వ తదితర అంశాలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ వివిధ డాక్యుమెంట్లను జస్టిస్ పీసీ ఘోష్ కు అందజేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఫైలును కూడా అందించినట్లు పేర్కొన్నాయి. కాగా, ఇప్పటి వరకు కాళేశ్వరం కమిషన్ 114 మందిని విచారించింది. ఇన్నాళ్లూ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించింది. ఇటీవల మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావులను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను 50 నిమిషాల పాటు విచారించింది. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు గతేడాది మార్చిలో కాళేశ్వరం కమిషన్ ను ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో ఈ కమిషన్ ను ఏర్పాటు చేసింది.