Santhanam: జీ 5 ఓటీటీ సెంటర్ కి హారర్ కామెడీ మూవీ!

- తమిళంలో మెప్పించిన 'డి డి నెక్స్ట్ లెవెల్'
- ప్రధానమైన పాత్రలో సంతానం
- థియేటర్స్ నుంచి మంచి రెస్పాన్స్
- ఈ నెల 13 నుంచి జీ 5లో స్ట్రీమింగ్
తమిళనాట స్టార్ కమెడియన్ అనిపించుకున్న సంతానం, ఆ తరువాత హీరోగా మారిపోవడానికి పెద్దగా సమయం తీసుకోలేదు. హీరో అయినప్పటికి తన మార్క్ కామెడీని ఆయన వదులుకోలేదు. ఆయన నుంచి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే 'డి డి నెక్స్ట్ లెవెల్'. అంటే 'డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్' అని అర్థం. మే 16వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. పాజిటివ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది.
వెంకట్ బోయన పల్లి - ఆర్య నిర్మించిన ఈ సినిమాకి, ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. నిలళ్ గళ్ రవి .. గౌతమ్ మీనన్ .. సెల్వ రాఘవన్ .. గీతికా తివారి .. యషిక ఆనంద్ .. కస్తూరి శంకర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఎంటర్టైన్ మెంట్ వైపు నుంచి మంచి మార్కులు కొట్టేసింది. చాలా కాలం తరువాత సంతానం విజృంభించాడనే టాక్ వచ్చింది. ఆలాంటి ఈ సినిమా, ఈ నెల 13 నుంచి ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
కథ విషయానికి వస్తే .. కృష్ణమూర్తి (సంతానం) సినిమాలకి రివ్యూలు రాస్తూ మంచి పేరు సంపాదించుకుంటాడు. ఇరుదరాజ్ (సెల్వ రాఘవన్) తెరకెక్కించిన ఒక సినిమాకి రివ్యూ రాయడానికి ఒక థియేటర్ కి వెళతాడు. అది దెయ్యాల థియేటర్ అనే విషయం ఆయనకి ఆ తరువాతనే అర్థమవుతుంది. భయంతో అక్కడ నుంచి బయటపడాలనుకున్న ఆయన ప్రయత్నం ఫలిస్తుందా లేదా? అనేది కథ.