Sakshi Office: 'సాక్షి' కార్యాలయానికి నిప్పు వార్తలు ఉత్తవే.. తగలబడింది ఫర్నిచర్ షాపు.. ఏలూరు పోలీసుల స్పష్టత

Eluru Police Clarify Sakshi Office Fire Incident Truth

  • 'సాక్షి' కార్యాలయానికి నిప్పుపెట్టారంటూ సోషల్ మీడియాలో ప్రచారం
  •  టీడీపీ నిరసన ర్యాలీకి, అగ్నిప్రమాదానికి సంబంధం లేదని పోలీసుల స్పష్టీకరణ
  •  ప్రమాద సమయంలో టీడీపీ కార్యకర్తలు ఘటనా స్థలానికి 200 మీటర్ల దూరంలో ఉన్నారని వెల్లడి
  • షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర కారణాలతో ప్రమాదం జరిగి ఉండొచ్చన్న అగ్నిమాపక సిబ్బంది

నగరంలోని ఓ ఫర్నిచర్ గోడౌన్‌లో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. అయితే, అదే భవనంలో ఉన్న 'సాక్షి' దినపత్రిక కార్యాలయానికి ఆందోళనకారులు నిప్పుపెట్టారంటూ కొన్ని మాధ్యమాలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ఖండించారు. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని వారు స్పష్టం చేశారు.

అసలేం జరిగిందంటే..
నిన్న దెందులూరు నియోజకవర్గానికి చెందిన వందల మంది మహిళలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏలూరు పాత బస్టాండ్ నుంచి ఎన్టీఆర్ పేటలోని 'సాక్షి' కార్యాలయానికి నిరసన ర్యాలీగా బయలుదేరారు. 'సాక్షి' ఛానల్‌లో ప్రసారమైన కొన్ని వ్యాఖ్యలకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టారు. 'సాక్షి' కార్యాలయం ఉన్న భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒకవైపు భవన యజమానురాలు నివసిస్తుండగా, మరోవైపు ఫర్నిచర్ మరమ్మతుల గోడౌన్ ఉంది. మొదటి అంతస్తులో ఒక పోర్షన్‌లో 'సాక్షి' కార్యాలయం, మరో పోర్షన్‌లో ఉపాధ్యాయ సంఘాల సమావేశ కార్యాలయం ఉన్నాయని పోలీసులు తెలిపారు.

టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసనగా వస్తున్నారన్న సమాచారంతో ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్‌కుమార్‌ పర్యవేక్షణలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసన ప్రదర్శన 'సాక్షి' కార్యాలయానికి సుమారు 200 మీటర్ల దూరంలో ఉండగానే, ఫర్నిచర్ గోడౌన్ వరండాలో మరమ్మతు కోసం ఉంచిన ఓ సోఫాకు మంటలు అంటుకున్నాయి. సమీపంలోని కుర్చీలు కూడా దగ్ధమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మంటలను ఆర్పివేశారు. అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకుని, మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు.

తప్పుడు ప్రచారంపై పోలీసుల స్పష్టత
ఫర్నిచర్ గోడౌన్‌లో జరిగిన ఈ అగ్నిప్రమాదాన్ని వక్రీకరిస్తూ 'సాక్షి' కార్యాలయాన్ని దహనం చేశారని, సిబ్బందిని నిర్బంధించి పెట్రోలు పోసి తగలబెట్టారని కొన్ని మాధ్యమాలు, సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని పోలీసులు తెలిపారు. దీనిపై గత రాత్రి ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్‌కుమార్‌, త్రీ టౌన్‌ సీఐ కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. "అగ్నిప్రమాద ఘటనకు, 'సాక్షి' కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదు. మంటలు చెలరేగే సమయానికి టీడీపీ నిరసన ప్రదర్శన ఘటనా స్థలానికి 200 మీటర్ల దూరంలో ఉంది. మంటలు ఆర్పుతున్న సమయానికి దెందులూరు మహిళలు ర్యాలీగా అక్కడికి చేరుకున్నారు. 'సాక్షి' కార్యాలయంపై దాడి, దహనం అని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు" అని స్పష్టం చేశారు.

తన గోడౌన్‌లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయని ఫర్నిచర్ షాపు యజమాని ఉంగరాల శ్రీనివాసరావు తెలిపారు. ఘటనా స్థలంలో రసాయనాలు ఉపయోగించి మంటలు సృష్టించినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదని జిల్లా అదనపు అగ్నిమాపక శాఖ అధికారి రామకృష్ణ వివరించారు. తాము వెళ్లేసరికే పోలీసులు మంటలను అదుపులోకి తెచ్చారని, షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర కారణాల వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై తప్పుడు ప్రచారం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.

View this post on Instagram

A post shared by Telugu Desam Party (@jai_tdp)

Sakshi Office
Eluru
Fire Accident
Furniture Shop
TDP Protest
Denduluru
Eluru Police
Fake News
Andhra Pradesh
Fire Safety
  • Loading...

More Telugu News