Gullak: అందరూ చూడాల్సిన సిరీస్ .. 'గుల్లక్'

- బాలీవుడ్ సిరీస్ గా వచ్చిన 'గుల్లక్'
- సోనీలివ్ లో 7 భాషల్లో అందుబాటులోకి
- మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చుట్టూ తిరిగే కథ
- సహజత్వమే ప్రధానమైన బలం
- IMDBలో 9.1 రేటింగ్ సాధించిన సిరీస్
ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లపై ఒక వైపున థ్రిల్లర్ సిరీస్ లు దూసుకుపోతుంటే, మరో వైపున ఫ్యామిలీ డ్రామా సిరీస్ లు కూడా జెండా ఎగరేస్తున్నాయి. అలాంటి ఫ్యామిలీ డ్రామా సిరీస్ లలో 'గుల్లక్' ముందు వరుసలో కనిపిస్తుంది. చాలా తక్కవ బడ్జెట్లో నిర్మితమైన ఈ సిరీస్, 'సోనీ లివ్' లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక్కో సీజన్ లో 5 ఎపిసోడ్స్ చొప్పున వదిలారు. 4 సీజన్స్ ను పూర్తి చేసుకున్న ఈ సిరీస్, IMDBలో 9.1/10 రేటింగును సాధించడం విశేషం.
2019లో ఫస్టు సీజన్ క్రింద 5 ఎపిసోడ్స్ ను వదలరు. అమృత్ రాజ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ సీజన్, సామాన్య ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఆ తరువాత 2021లో వచ్చిన సీజన్ 2 .. 2022లో వచ్చిన సీజన్ 3కి కూడా పలాష్ విశ్వాని దర్శకత్వం వహించాడు. క్రితం ఏడాది జూన్ 7వ తేదీ నుంచి సీజన్ 4 అందుబాటులోకి వచ్చింది. ఈ సీజన్ కి శ్రేయాన్ష్ పాండే దర్శకుడిగా వ్యవహరించాడు.
సోనీ లివ్ లో ఇప్పుడు ఈ 20 ఎపిసోడ్స్ అందుబాటులో ఉన్నాయి. హిందీతో పాటు తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. మరాఠీ .. బెంగాలీ భాషలలో ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన సంతోష్ మిశ్రా .. శాంతి మిశ్రా .. వారి ఇద్దరి పిల్లల చుట్టూ తిరిగే కథ ఇది. మధ్యతరగతి కుటుంబంలో కనిపించే ఆశలు .. నిరాశలు .. సర్దుబాట్లను సహజంగా ఆవిష్కరించిన విధానమే ఈ సిరీస్ ఇంతగా కనెక్ట్ కావడానికి కారణమని చెప్పుకోవచ్చు.
