Balakrishna: 'అఖండ‌ 2' టీజ‌ర్‌.. అభిమానితో బాల‌య్య చ‌ర్చ‌.. బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ ఫోన్ కాల్ రికార్డింగ్

Balakrishna Akhanda 2 Teaser Viral Fan Phone Call Recording

  • బాలకృష్ణ 'అఖండ 2-తాండవం' టీజర్ విడుదల
  • 24 గంటల్లో 24 మిలియన్లకు పైగా వ్యూస్
  • బాలయ్య పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో టీజర్‌కు భారీ స్పందన
  • అభిమానితో బాలకృష్ణ ఫోన్ కాల్ సోషల్ మీడియాలో వైరల్
  • సెప్టెంబర్ 25న దసరా కానుకగా సినిమా విడుదల

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం 'అఖండ 2-తాండవం'. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా టీజర్‌ను బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. 

ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. కేవలం 24 గంటల్లోనే ఈ టీజర్ యూట్యూబ్‌లో 24 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ట్రెండింగ్‌లో నిలిచింది. "నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడు కూడా కన్నెత్తి చూడడు.. నువ్వు చూస్తావా.. అమాయకుల ప్రాణాలు తీస్తావా" అంటూ బాలకృష్ణ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. బోయపాటి మార్క్ టేకింగ్, బాలయ్య యాక్ష‌న్‌, అద్భుతమైన విజువల్స్, నేపథ్య సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 

అభిమానితో బాలయ్య సంభాషణ వైరల్
టీజర్‌కు వస్తున్న స్పందన పట్ల నందమూరి బాలకృష్ణ కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అనంతపురంకు చెందిన జగన్ అనే అభిమాని నేరుగా బాలకృష్ణకు ఫోన్ చేసి తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ ఫోన్ కాల్ రికార్డింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

"ఇది అరాచకం అన్నా. ఆల్ ఇండియాలో మీ లుక్‌ను కొట్టేవాడు లేడు. 'దాన వీర శూరకర్ణ'లో అన్న ఎన్టీఆర్ గారి లుక్ మాదిరిగా ఉంది. చరిత్ర ఉన్నంత వరకు ఈ లుక్ గుర్తుండిపోతుంది" అని అభిమాని ఉద్వేగంగా మాట్లాడారు. 'అఖండ 2'తో ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించాలని అభిమాని ఆకాంక్షించగా.. 'డౌట్ ఏముంది' అని బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు.

తన అభిమానులే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా టీజర్‌ను పదే పదే చూస్తున్నారని, రాత్రంతా చూస్తే నిద్ర కూడా పట్టదని తాను వారితో అన్నట్లు బాలకృష్ణ తెలిపారు. తన తల్లిదండ్రుల ఆశీస్సులు, కళామతల్లి దీవెనలు, అభిమానుల ఆదరణ వల్లే తాను ఇలాంటి పాత్రలు చేయగలుగుతున్నానని ఆయన వినమ్రంగా చెప్పారు. "దైవశక్తి, కల్మషం లేని మంచి మనసు మీకు ఉండటం వల్లే ఇలాంటి మంచి క్యారెక్టర్స్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి" అని అభిమాని జ‌గ‌న్‌ ప్రశంసించారు.

ఇక‌, 'అఖండ 2-తాండవం' చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. టీజర్‌తోనే అంచనాలను అమాంతం పెంచేసిన ఈ సినిమా, విడుదలయ్యాక ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Balakrishna
Akhanda 2
Akhanda 2 Teaser
Boyapati Srinu
Nandamuri Balakrishna
Telugu cinema
Phone call recording
Akhanda movie sequel
Dasara release
Telugu movies
  • Loading...

More Telugu News