Raja Raghuvanshi murder: రాజా రఘువంశీ హంతకుడి చెంప చెళ్లుమనిపించిన ప్రయాణికుడు.. వీడియో ఇదిగో!

- మేఘాలయలో హనీమూన్ మర్డర్ పై ప్రజాగ్రహం
- ముఖాలకు మాస్క్ తొడిగి నిందితుల తరలింపు
- ఇండోర్ ఎయిర్ పోర్ట్ లో ఓ నిందితుడిపై చేయిచేసుకున్న ప్యాసింజర్
రాజా రఘువంశీ హత్య కేసులో అరెస్టయిన నిందితుల్లో ఒకడికి ఊహించని పరిణామం ఎదురైంది. పోలీసులు నిందితులకు మాస్క్ లు తొడిగి తీసుకెళుతుండగా ఓ ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిందితులలో ఒకడి చెంప చెళ్లుమనిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మేఘాలయ పోలీసులు నలుగురు నిందితులను విమానాశ్రయంలోకి తీసుకెళ్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
రాజా రఘువంశీ హత్య పట్ల ఆ ప్రయాణికుడు తన ఆగ్రహాన్ని ఈ విధంగా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నిందితులు మాస్కులు ధరించి ఉండటంతో ఎవరికి దెబ్బ తగిలిందనేది తెలియరాలేదు. రాజా రఘువంశీ హత్య కేసులో అరెస్టయిన రాజ్ కుశ్వాహా, విశాల్ చౌహాన్, ఆకాశ్ రాజ్‌పుత్, ఆనంద్ కుర్మీ అనే నలుగురు నిందితులను మేఘాలయ పోలీసుల 12 మంది సభ్యుల బృందం స్థానిక కోర్టు నుంచి ట్రాన్సిట్ కస్టడీ పొంది షిల్లాంగ్‌కు తీసుకువెళ్లిందని ఇండోర్ అదనపు డీసీపీ రాజేష్ దండోతియా తెలిపారు.