Palla Rajeshwar Reddy: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో జారిపడిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. విరిగిన తుంటి ఎముక!

- నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్
- కలిసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడిన ఎమ్మెల్యే
- హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో పల్లాకు చికిత్స
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కాళేశ్వరం విచారణ కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను కలిసేందుకు ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లిన ఆ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అక్కడ ప్రమాదవశాత్తూ జారిపడ్డారు. ఈ ఘటనలో ఆయన తుంటి ఎముకకు గాయమైనట్టు తెలిసింది. వెంటనే ఆయనను హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ నేడు హాజరుకాబోతున్నారు. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో ఈ విచారణ జరగనుంది. దీంతో ఆయనకు సంఘీభావం తెలిపేందుకు, ఆయనతో సమావేశమయ్యేందుకు పలువురు బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు ఉదయం నుంచి ఎర్రవల్లిలోని ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా కేసీఆర్‌ను కలిసేందుకు ఫామ్‌హౌస్‌కు వెళ్లినప్పుడు అక్కడ ప్రమాదవశాత్తు జారిపడ్డారు.