Arunachalam Temple: అరుణాచలం సాక్షిగా అపచారం.. ఆలయం ప్రాంగణంలో మాంసాహారం భుజించిన జంట!

Couple Detained for Eating Meat at Arunachalam Temple

  • ఆలయ ఐదో ప్రాకారంలో దంపతులు ఆహారం సేవనం
  • అది మాంసాహారమంటూ భక్తుల ఆరోపణ, ఫిర్యాదు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన దేవాదాయశాఖ అధికారులు  
  • దంపతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు

తిరువణ్ణామలైలోని ప్రఖ్యాత అరుణాచలేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో మాంసాహారం తిన్నారనే ఆరోపణలపై పోలీసులు ఓ జంటను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిన్న అరుణాచలేశ్వరాలయానికి వచ్చిన దంపతులు ఆలయంలోని ఐదో ప్రాకారంలో కూర్చుని వెంట తెచ్చుకున్న ప్లాస్టిక్ సంచిలోని ఆహార పొట్లాలను విప్పి తినడం ప్రారంభించారు. వారు తింటున్నది మాంసాహారమని అక్కడే ఉన్న కొందరు భక్తులు అనుమానించారు. ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా వారు ప్రవర్తిస్తున్నారని భావించి, వెంటనే ఈ విషయాన్ని ఆలయ దేవాదాయశాఖ కార్యాలయ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు.

భక్తుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు దేవాదాయశాఖ అధికారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు దంపతులను పోలీస్ స్టేషన్‌కు తరలించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా దంపతులు మాట్లాడుతూ.. తాము కుస్కా (ప్లెయిన్ బిర్యానీ) ఆర్డర్ చేశామని, అయితే అందులో పొరపాటున చికెన్ ముక్క వచ్చిందని చెప్పినట్టు తెలిసింది. తదుపరి విచారణ కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు. 

కాగా,  ఆలయంలోకి మాంసాహారం తీసుకురావడం, దాన్ని తినడం వల్ల ఆలయం మైలపడిందని భావించిన అర్చకులు, అధికారులు బుధవారం ఉదయం ఆలయ శుద్ధి కార్యక్రమాలను చేపట్టారు. గర్భగుడి ముందు సూర్యభగవానుడి విగ్రహం సమీపంలో పవిత్ర కలశాలను ఏర్పాటు చేసి, శివాచార్యుల వేదమంత్రోచ్ఛారణల మధ్య స్థాపన పూజ నిర్వహించారు. అనంతరం అరుణాచలేశ్వర స్వామికి, ఉణ్ణామలై అమ్మవారికి పవిత్ర జలాలతో ప్రత్యేక అభిషేకాలు జరిపారు. ఆలయంలోని అన్ని సన్నిధుల్లోనూ పవిత్ర జలాన్ని చల్లి, సంప్రోక్షణ కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

Arunachalam Temple
Arunachaleswarar Temple
Tamil Nadu
Couple arrested
Meat in temple
Kuska Biryani
Temple desecration
Tiruvannamalai
  • Loading...

More Telugu News