Manohar Lal Khattar: భారత్ లో ఇక ఏసీలకు కొత్త ప్రమాణాలు!

New AC Standards in India Announced by Manohar Lal Khattar

  • ఏసీలకు టెంపరేచర్ లిమిట్ పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు
  • కనిష్ఠ, గరిష్ఠ డిగ్రీలపై పరిమితి విధించబోతున్న కేంద్రం
  • ఇకపై కనిష్ఠం 20 డిగ్రీల సెల్సియస్

దేశంలో ఎయిర్ కండీషనర్ల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో ఏసీల ఉష్ణోగ్రతపై పరిమితులు విధించేందుకు చర్యలు చేపట్టింది. కొత్తగా తయారయ్యే ఏసీలకు కనిష్ఠంగా 20 డిగ్రీల సెల్సియస్, గరిష్ఠంగా 28 డిగ్రీల సెల్సియస్‌కు మించకుండా ప్రమాణాలు నిర్దేశించనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తెలియజేశారు.

దేశంలోని అనేక ఇళ్ళు, కార్యాలయాలలో 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఏసీలను వినియోగిస్తున్నారని, దీనివల్ల విద్యుత్ వినియోగం పెరుగుతోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి ఏసీలకు కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్, గరిష్ఠ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్‌గా నిర్ణయించామని, త్వరలోనే దీనిని అమలు చేస్తామని తెలిపారు. దీని ఫలితాలను పరిశీలించి, ఏసీల వినియోగంలో ఏకరూపతను తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం మార్కెట్‌లో లభ్యమవుతున్న కొన్ని ఏసీలు కనిష్ఠంగా 16 డిగ్రీలు, మరికొన్ని 18 డిగ్రీల వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతతో లభిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఏసీలు 20 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతతో ప్రారంభం కానున్నాయి.

ఏసీల వినియోగంపై బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) ఒక సర్వే నిర్వహించింది. చాలా వరకు ఏసీలు 20-21 డిగ్రీల మధ్య నడుస్తున్నట్లు గుర్తించింది. వాస్తవానికి ఏసీలను 24-25 డిగ్రీల మధ్య వినియోగిస్తే విద్యుత్ ఆదా అవుతుందని బీఈఈ పేర్కొంది. ప్రతి డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను పెంచడం ద్వారా 6 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుందని తెలిపింది. దీని ద్వారా విద్యుత్ బిల్లులను తగ్గించడంతో పాటు కర్బన ఉద్గారాలను కూడా తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. 

Manohar Lal Khattar
Air Conditioners
AC Temperature Limit
Energy Efficiency
Bureau of Energy Efficiency
BEE
Power Consumption
India
Climate Change
Carbon Emissions
  • Loading...

More Telugu News