Chevireddy Bhaskar Reddy: సిట్ ఆఫీసుకు నేనే వస్తా!: చెవిరెడ్డి

- తన అనుచరులను పోలీసులు తీసుకువెళ్లి వేధిస్తున్నారన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి
- మద్యం కేసులో తన పేరు చెప్పించాలని చూస్తున్నారని మండిపడ్డ చెవిరెడ్డి
- అరెస్టుకు తాను సిద్దం అయితే భవిష్యత్తులో వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిక
ఏపీ మద్యం కుంభకోణం కేసులో తనను ఇరికించి, అక్రమంగా అరెస్టు చేయాలని చూస్తున్నారని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసుతో సంబంధం లేని తనను ఈ కేసులో ఇరికించాలని సిట్ అధికారులు చూడటం బాధాకరమని అన్నారు. గిరి, బాలాజీ సహా మరికొద్ది మందిని తీసుకువెళ్లి తన పేరు చెప్పించాలని వారికి నరకం చూపిస్తున్నారని ఆరోపించారు.
తనను కేసులో అరెస్టు చేయించి సంతోషపడాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. తనను అరెస్టు చేయాలని అనుకుంటే నేరుగా తానే సిట్ కార్యాలయానికి వస్తానని సవాల్ చేశారు. తనను ఈ కేసులో ఇరికించేందుకు పోలీసులు చాలా కష్టపడుతున్నారని, దేనికైనా తాను సిద్ధమని పేర్కొన్నారు. పథకం ప్రకారం మద్యం కేసులో బెదిరించి తమ పేర్లు బయటకు తీసుకురావాలని చూస్తున్నారని ఆరోపించారు.
అమాయకపు వ్యక్తులను వేధించడం బాధాకరమని అన్నారు. మాజీ అధికారి ఘట్టమనేని శ్రీనివాస్ స్క్రిప్ట్‌తో తన పేరు మద్యం కేసులో బయటకు తెచ్చారని అన్నారు. తాను జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నానని, అయితే భవిష్యత్తులో వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తనతో ఉన్న వారందరినీ తీసుకువెళ్లి వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
తన పేరు కేసులో సంబంధం ఉన్నట్లు చెబితే తప్ప వదిలేది లేదని పోలీసులు వారిని భయపెడుతున్నారని ఆరోపించారు. తన అనుచరులను పోలీసులు అక్రమంగా తీసుకువెళ్లి చిత్రహింసలకు గురి చేస్తుండటంతో వారి కుటుంబాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయన్నారు. పోలీసుల దుశ్చర్యలపై బాధిత కుటుంబాల వారు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు వేయనున్నారని చెవిరెడ్డి భాస్కరరెడ్డి తెలిపారు.