Rohini: పాత్రికేయుల పిల్లలకు ప్రైవేటు స్కూళ్లలో సగం ఫీజు రాయితీ... తెలంగాణ సర్కారు నిర్ణయం!

Telangana Govt Offers 50 Percent Fee Discount in Private Schools for Journalists Children

  • ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని కోరిన హెచ్‌యూజే – టీడబ్య్యూజేఎఫ్ నేతలు
  • సానుకూలంగా స్పందిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన హైదరాబాద్ డీఈవో రోహిణి
  • ఈ అవకాశాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేసిన హెచ్‌యూజే – టీడబ్య్యూజేఎఫ్ నేతలు

తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు ఒక శుభవార్తను అందించింది. నగరాలు, పట్టణాల్లో విద్య వ్యాపారంగా మారిన ఈ తరుణంలో, సామాన్య, మధ్యతరగతి వర్గాలు కార్పొరేట్ విద్యాసంస్థల్లో తమ పిల్లలను చేర్పించలేని పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో, వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిణి రోహిణి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 50 శాతం వరకు రాయితీ కల్పించాలని డీఈవో ఆర్. రోహిణి యాజమాన్యాలకు సూచించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఆమె నిన్న విడుదల చేశారు.

ఈ అంశంపై హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ (హెచ్‌యూజే – టీడబ్ల్యూజేఎఫ్) అధ్యక్షుడు బి. అరుణ్ కుమార్, కార్యదర్శి బి. జగదీశ్వర్ చేసిన విజ్ఞప్తి మేరకు డీఈవో రోహిణి సానుకూలంగా స్పందిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ ఈవోలు, డిప్యూటీ ఈఓఎస్ (ఎంఈవో)లు తగు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.

ఈ సందర్భంగా డీఈవో రోహిణికి హెచ్‌యూజే – టీడబ్ల్యూజేఎఫ్ నేతలు అరుణ్ కుమార్, జగదీశ్వర్‌లు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని హైదరాబాద్‌లోని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

Rohini
Telangana government
journalist welfare
private schools fee reimbursement
Hyderabad news
journalists children education
Arun Kumar
Jagadeeshwar
Hyderabad Union of Journalists
TWCJF
  • Loading...

More Telugu News