Nara Lokesh: హలో జగన్ గారూ... మీ కపట బుద్ధి చూస్తే నవ్వొస్తోంది: నారా లోకేశ్

- నాది కాలేజీ జీవితం, మీది జైలు జీవితం అంటూ లోకేశ్ విమర్శలు
- నాకు క్లాస్‌మేట్స్ ఉంటే... మీకు జైల్‌మేట్స్ ఉన్నారు
- కన్నతల్లి, చెల్లిని రోడ్డుకీడ్చి, కోర్టుకు లాగారు
- మీ ఐదేళ్ల పాలన కక్ష సాధింపులతో చీకటిమయం
- మీ హయాంలోని నేరాలకు మమ్మల్ని నిందించే ప్రయత్నం చేయొద్దంటూ లోకేశ్ ఫైర్
సాక్షి చానల్లో ఓ డిబేట్లో అమరావతి మహిళలను కించపరిచేలా తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి నారా లోకేశ్ వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ తీరును ఎండగట్టారు. గత ఐదేళ్ల పాలనపై ఘాటైన ఆరోపణలు చేశారు. "జగన్ గారూ! మీ కపట బుద్ధి చూస్తే నవ్వొస్తోంది" అంటూ ధ్వజమెత్తారు.
తన జీవితాన్ని, జగన్ జీవితాన్ని పోల్చారు. "నాకు కాలేజీ జీవితం ఉంది, మీకు జైలు జీవితం ఉంది. నాకు క్లాస్‌మేట్స్ ఉన్నారు, మీకు జైల్‌మేట్స్ ఉన్నారు. అర్థం అయ్యిందా రాజా?" అని లోకేశ్ ప్రశ్నించారు. మహిళలను గౌరవించడం తనకు నేర్పించారని, కానీ జగన్ మాత్రం కన్నతల్లిని, సొంత చెల్లిని ఇంటి నుంచి గెంటేసి, కోర్టుకు లాగారని ఆరోపించారు. అంతేకాకుండా, వారిపై రోజూ మీడియా, సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేయిస్తున్నారని లోకేశ్ విమర్శించారు.
జగన్ ఐదేళ్ల ముఖ్యమంత్రి పాలన ఒక చీకటి అధ్యాయమని లోకేశ్ అభివర్ణించారు. ఈ కాలంలో కక్ష సాధింపు రాజకీయాలు, దళితులు మరియు మహిళలపై అఘాయిత్యాలు, మీడియా ద్వారా అబద్ధాల ప్రచారం జరిగాయని ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై అక్రమ కేసులు బనాయించి, జైళ్లలో పెట్టించారని, ఆంధ్రప్రదేశ్‌ను పోలీస్ రాజ్యంగా మార్చారని దుయ్యబట్టారు. "మీ హయాంలో జరిగిన నేరాలకు మమ్మల్ని నిందించే ప్రయత్నం కూడా చేయొద్దు. కప్పిపుచ్చే రోజులు పోయాయి" అని నారా లోకేశ్ స్పష్టం చేశారు.