Kenya Road Accident: కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రవాస భారతీయుల దుర్మరణం

- మృతులంతా ఖతార్‌లో నివసిస్తున్న వారని భారత దౌత్య కార్యాలయం వెల్లడి
- మొత్తం 28 మంది ప్రవాస భారతీయులు కెన్యా పర్యటనకు వెళ్లిన బృందం
- నైరోబిలోని భారత హైకమిషన్ అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నం
- బస్సు అదుపు తప్పి లోయలో పడిందని స్థానిక మీడియా కథనాలు, కారణంపై దర్యాప్తు
కెన్యాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రవాస భారతీయులు మృతి చెందారు. వీరంతా ఖతర్‌లో నివసిస్తున్న వారని, కెన్యా పర్యటనకు వెళ్ళిన సమయంలో ఈ దుర్ఘటన సంభవించిందని ఖతార్‌లోని భారత దౌత్య కార్యాలయం మంగళవారం ధ్రువీకరించింది.
ఖతార్‌లో నివసిస్తున్న 28 మంది ప్రవాస భారతీయుల బృందం కెన్యాకు విహారయాత్రకు వెళ్లింది. వీరు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఐదుగురు భారతీయులు మరణించినట్లు తమకు సమాచారం అందిందని ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.
"మాకు అందిన సమాచారం ప్రకారం, ఈ దురదృష్టకర ఘటనలో ఐదుగురు మరణించారు. నైరోబిలోని భారత హైకమిషన్ (హెచ్‌సీఐ) అధికారులు ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మేము వారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం" అని ఎంబసీ పేర్కొంది.
మరణించిన వారి పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. కొన్ని స్థానిక మీడియా కథనాల ప్రకారం, ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని తెలుస్తోంది. అయితే, బస్సు నిజంగా అదుపు తప్పిందా లేక ఏదైనా మరో వాహనం ఢీకొట్టిందా అనే విషయంపై దర్యాప్తు అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.