Farooq Abdullah: కశ్మీర్‌కు రైలు కూత... కళ్లు చెమర్చాయంటూ ఫరూక్ అబ్దుల్లా భావోద్వేగం

- శ్రీనగర్-కత్రా వందేభారత్ రైల్లో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా పయనం
- కశ్మీర్‌కు రైల్వే సేవలు రావడం చూసి కళ్లు చెమ్మగిల్లాయని వ్యాఖ్య
- ఇంజినీర్లు, కార్మికులకు ఫరూక్ అభినందనలు
- అమర్‌నాథ్, వైష్ణోదేవి యాత్రికులకు ప్రయోజనకరమన్న ఆశాభావం
- రైలు మార్గంతో పర్యాటకం, వాణిజ్యం పెరుగుతాయని వెల్లడి
- జూన్ 6న ఈ రైలు సేవలను ప్రారంభించిన ప్రధాని మోదీ
జమ్మూకశ్మీర్‌లో ఇటీవలే ప్రారంభమైన శ్రీనగర్-కత్రా మార్గంలోని వందేభారత్ రైలులో నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ప్రయాణించారు. దేశ రైల్వే వ్యవస్థతో ఎట్టకేలకు కశ్మీర్ లోయ పూర్తిస్థాయిలో అనుసంధానం కావడం పట్ల ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ చారిత్రక ఘట్టాన్ని చూసి తన కళ్లు చెమ్మగిల్లాయని తెలిపారు.
ఈ సందర్భంగా ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ, "దేశ రైల్వే నెట్‌వర్క్‌తో కశ్మీర్ కలవడం చూసి నా హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. నా కళ్లు చెమ్మగిల్లాయి. ఈ ఘనతను సాకారం చేసిన ఇంజినీర్లు, కార్మికులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను" అని పేర్కొన్నారు. జమ్మూ నుంచి కత్రా వరకు సాగిన రైలు ప్రయాణం తనకు గొప్ప అనుభూతినిచ్చిందని, ముఖ్యంగా అంజీ వంతెనతో పాటు సొరంగాల ద్వారా సాగిన ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉందని, ఇది చిరకాలం గుర్తుండిపోయే అనుభవమని ఆయన వివరించారు.
ఈ రైలు సేవల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ప్రయాణం మరింత సులభతరం అవుతుందని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. జులైలో ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్రకు వచ్చే భక్తులు ఈ రైలు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందని, దీనివల్ల వైష్ణోదేవి ఆలయానికి కూడా భక్తుల తాకిడి పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానికంగా వాణిజ్యం, పర్యాటకం గణనీయంగా అభివృద్ధి చెందడంతో పాటు ఇరు ప్రాంతాల ప్రజల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది ప్రజలు సాధించిన విజయమని ఆయన కొనియాడారు.
కాగా, జమ్మూకశ్మీర్‌లోని కత్రా, శ్రీనగర్ పట్టణాలను కలుపుతూ ఏర్పాటు చేసిన ఈ వందేభారత్ రైలు సర్వీసులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 6న ప్రారంభించిన విషయం తెలిసిందే. ఉదంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింకు ప్రాజెక్టులో భాగంగా ఈ మార్గాన్ని పూర్తిచేశారు. జమ్మూ ప్రాంతాన్ని కశ్మీర్ లోయతో కలిపే తొలి రైలు ఇదే కావడం గమనార్హం.