Donald Trump: "మస్క్ డ్రగ్స్ తీసుకున్నారా?" అనే ప్రశ్నకు ట్రంప్ స్పందన

- ఎలాన్ మస్క్ మాదకద్రవ్యాల వినియోగం ఆరోపణలపై ట్రంప్ ఆచితూచి స్పందన
- ఈ ఆరోపణలు కలవరపెట్టేవే అయినా, అవి నిర్ధారితం కాలేదని వ్యాఖ్య
- మస్క్ డ్రగ్స్ వాడారనేది తాను నమ్మడం లేదని, అలా జరగకూడదని ఆశిస్తున్నట్లు వెల్లడి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం జరుగుతున్నం సంగతి తెలిసిందే. మస్క్ ఇటీవల ప్రభుత్వ వ్యయ విధానాలపై బహిరంగంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడంతో ఇరువురి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ట్రంప్ ప్రతిపాదించిన పన్ను, వ్యయ ప్యాకేజీని 'దరిద్రగొట్టు నిర్ణయం'గా మస్క్ అభివర్ణించిన తర్వాత ఇరువురి మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయి. దీనికి ప్రతిగా, మస్క్ కంపెనీలకు చెందిన ప్రభుత్వ కాంట్రాక్టులను తగ్గించవచ్చని ట్రంప్ సూచించగా, లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన రహస్య ఫైళ్లలో ట్రంప్ పేరు ఉందంటూ మస్క్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో, ట్రంప్ కు మీడియా నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.
ఎలాన్ మస్క్ తన సలహాదారుగా ఉన్న సమయంలో మాదకద్రవ్యాలు వినియోగించారంటూ వచ్చిన వార్తలపై ట్రంప్ ఆచితూచి స్పందించారు. ఈ ఆరోపణలు కలవరపరిచేవే అయినప్పటికీ, అవి ఇంకా నిర్ధారితం కాలేదని అన్నారు. "మస్క్ వైట్‌హౌస్‌కు డ్రగ్స్ తెచ్చారా?" అని విలేకరులు ప్రశ్నించగా, "నాకు నిజంగా తెలియదు. నేనలా అనుకోవడం లేదు. అలా జరిగి ఉండకూడదని ఆశిస్తున్నాను" అని ట్రంప్ బదులిచ్చారు.
2024 ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్‌తో కలిసి ఉన్నప్పుడు మస్క్ కెటామైన్, ఎక్స్‌టసీ, సైకెడెలిక్ మష్రూమ్స్ వంటివి వినియోగించినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ మే నెలాఖరులో 'న్యూయార్క్ టైమ్స్' పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం వెలువడిన తర్వాత ట్రంప్ ఈ అంశంపై స్పందించడం ఇదే తొలిసారి.
ఈ ఆరోపణలపై మస్క్ వెంటనే 'ఎక్స్' వేదికగా స్పందించారు. "నేను డ్రగ్స్ వాడుతున్నానని ఎవరైనా ఆరోపిస్తే, వారు అబద్ధాలకోరు అని వెంటనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచంలో అత్యధికంగా ఫోటోలు తీయబడే వ్యక్తుల్లో నేనొకడిని, వారంలో ఏడు రోజులూ సమావేశాల్లో పాల్గొంటాను!" అని ఆయన పేర్కొన్నారు. 2018లో జో రోగన్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఘటన తర్వాత దాదాపు మూడేళ్లపాటు తాను మాదకద్రవ్యాల పరీక్షలు చేయించుకున్నానని, అందులో "డ్రగ్స్ లేదా ఆల్కహాల్‌కు సంబంధించిన స్వల్ప ఆనవాళ్లు కూడా కనుగొనలేదు" అని మస్క్ వివరించారు.
అయితే, ప్రభుత్వ ప్రత్యేక ఉద్యోగి హోదాలో ఉన్నప్పుడు మస్క్ ఏవైనా పదార్థాలు వినియోగించారా లేదా అనేది అస్పష్టంగానే ఉందని 'యూఎస్‌ఏ టుడే' నివేదించింది. ఈ విషయంపై ఆయన్ను చివరి పనిదినాన ప్రశ్నించగా, "ఈ విషయం వదిలేద్దాం, ముందుకు సాగుదాం" అంటూ మస్క్ సమాధానాన్ని దాటవేశారు.