Kakani Govardhan Reddy: కాకాణి గోవర్ధన్ రెడ్డికి రిమాండ్

- కాకాణికి 14 రోజుల రిమాండ్ విధించిన గుంటూరు సీఐడీ కోర్టు
- ఎమ్మెల్యే సోమిరెడ్డిపై అసభ్య పోస్టులపై మంగళగిరిలో కాకాణిపై కేసు
- పీటీ వారెంట్‌పై ఆయన్ను గుంటూరు కోర్టులో హాజరుపరిచిన సీఐడీ అధికారులు
అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి గుంటూరు సీఐడీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. టీడీపీ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై మంగళగిరిలో కాకాణిపై సీఐడీ కేసు నమోదు చేసింది. దీంతో పీటీ వారెంట్‌పై ఆయన్ను గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో కాకాణిని సీఐడీ అధికారులు నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు.
కాగా, గతంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫొటోలను మార్ఫింగ్ చేసి ఆయన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ కాకాణిపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మేకల నరేంద్ర అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. పీటీ వారెంట్‌పై కాకాణిని విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకుని నెల్లూరు నుంచి భారీ భద్రత నడుమ మంగళగిరికి తరలించారు. ఈ రోజు గుంటూరులోని కోర్టులో మాజీ మంత్రిని హాజరుపరిచారు.