Nandamuri Balakrishna: నన్ను చూసుకునే నాకు పొగరు... ఇక బాలకృష్ణ అంటే ఏంటో చూస్తారు: బాలకృష్ణ

- నేడు బాలకృష్ణ 64వ పుట్టినరోజు
- బసవతారకం ఆసుపత్రిలో జన్మదిన వేడుకలు
- వయసు కేవలం అంకె మాత్రమేనన్న బాలయ్య
- తనకు పొగరు ఎక్కువని అంటుంటారని, అది నిజమేనని వ్యాఖ్య
"చాలామంది నాకు పొగరని అనుకుంటారు, అది నిజమే!... నన్ను చూసుకునే నాకు పొగరు... ఇకపై బాలకృష్ణ అంటే ఏంటో చూపిస్తాను!" అంటూ ప్రముఖ కథానాయకుడు, టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలయ్య ఇవాళ (జూన్ 10) తన 64వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులతో మాట్లాడుతూ, పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
తొలుత ఆసుపత్రి ప్రాంగణంలోని తన తల్లిదండ్రులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతుల విగ్రహాలకు బాలకృష్ణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అభిమానుల కేరింతల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "తల్లిదండ్రుల ఆశీస్సులు, అభిమానుల అండదండలతో 64 వసంతాలు పూర్తిచేసుకున్నాను. వయసు అనేది కేవలం ఒక అంకె మాత్రమే, దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను. చాలామంది నాకు పొగరని, అహంకారమని అంటుంటారు. అవును, నన్ను చూసుకుంటే, నా క్రమశిక్షణ, నా అంకితభావం చూసుకుంటే నాకే పొగరుగా అనిపిస్తుంది. అందులో తప్పేముంది?" అని తనదైన శైలిలో వ్యాఖ్యానించి అందరినీ ఆశ్చర్యపరిచారు. బిరుదులు వస్తుంటాయని, పోతుంటాయని, వాటికి తాను అలంకారమే తప్ప అవి తనకు అలంకారం కాదని, మన పని మనం నిజాయతీగా చేసుకుంటూ పోవడమే ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు.
బసవతారకం ఆసుపత్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, 15 ఏళ్ల క్రితం ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆసుపత్రి అభివృద్ధికి, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని పేదలకు అందించడానికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. తన తండ్రి ఎన్టీఆర్ ఆశయం మేరకు, ఒకప్పుడు తాను కూడా మెడిసిన్ ఎంట్రన్స్ పరీక్ష రాశానని, అయితే విధి మరోలా తలచి సినిమాల్లోకి వచ్చానని, కానీ సినిమాల్లో డాక్టర్ పాత్రలు పోషించడం ద్వారా ఆ కోరిక తీర్చుకున్నానని సరదాగా వ్యాఖ్యానించారు.