NT Rama Rao: ఎన్టీఆర్ తో పాటు అందరికీ కలిసొచ్చిన బంగ్లా అది: దర్శక నిర్మాత తాతినేని ప్రసాద్

- ఎన్టీఆర్ .. ఎస్వీఆర్ ఒకే రూములో ఉండేవారు
- అవకాశాల కోసం ఒకే సైకిల్ పై తిరిగారు
- చిరంజీవిగారు కూడా అదే రూములో ఉండేవారు
- ఆ బంగ్లా అందరినీ స్టార్స్ ను చేసిందన్న తాతినేని ప్రసాద్
ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రకాశరావుకి ఎన్టీ రామారావుతో ఎంతో అనుబంధం ఉంది. వారిద్దరి ప్రస్ధానం ఒకేసారి మొదలైంది. ఆ ఇద్దరినీ గురించి తాతినేని ప్రకాశరావు తనయుడు ప్రసాద్ ఓ యూట్యూబ్ ఛానల్ వారితో మాట్లాడారు. "నేను 1952లో పుట్టాను .. ఆ ఏడాదిలోనే మా నాన్నగారు 'పల్లెటూరు' సినిమాకి దర్శకుడిగా చేసేవారు. నాకు కాస్త ఊహ తెలిసిన తరువాత మా అమ్మ చెప్పిన సంగతులు నాకు బాగా గుర్తున్నాయి" అని అన్నారు.
" మద్రాస్ లో 'రిపబ్లిక్ గార్డెన్' పేరుతో ఒక బంగ్లా ఉండేది. ఆ బంగ్లాలో ఓ 12 రూముల వరకూ ఉండేవి. ఆ బంగ్లాలోని ఒక రూములో నాన్నగారు .. రామారావుగారు .. ఎస్వీ రంగారావుగారు కలిసి ఉండేవారట. ఆ తరువాత పుండరీకాక్షయ్య గారు చేరినట్టుగా అమ్మగారు చెప్పారు. అందరూ కలిసి సినిమాలో అవకాశాల కోసం సైకిల్ పై తిరిగేవారట. ఎన్టీఆర్ గారు .. ఎస్వీఆర్ గారు ఒకే సైకిల్ పై స్టూడియోలకు వెళ్లేవారట.
"కొంతకాలానికి దర్శకుడిగా నాన్నగారు .. నటులుగా రామారావుగారు .. రంగారావుగారు ఒక స్థాయికి ఎదిగారు. అందరూ కూడా వివాహం తరువాత అక్కడికి దగ్గరలోనే కాపురాలు పెట్టారు. అదే బంగ్లాలో ఉన్న లేడీ ఆర్టిస్టులు కూడా ఒక స్థాయికి చేరుకున్నారని విన్నాను. ఆ తరువాత చిరంజీవిగారు కూడా తన స్నేహితులతో కలిసి ఆ బంగ్లాలో ఉన్నారు. అలా ఆ బంగ్లా ఎంతోమందిని స్టార్స్ ను చేసింది" అని చెప్పారు.