Renuka Chowdhury: దమ్ము ధైర్యం ఉంటే అమరావతి ప్రాంతంలో జగన్ పర్యటించాలని సవాల్ చేసిన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి

Renuka Chowdhury Challenges Jagan to Visit Amaravati

  • జగన్ పై రేణుకా చౌదరి తీవ్ర వ్యాఖ్యలు
  • తండ్రి వైఎస్ఆర్ అంత్యక్రియలు కాకమునుపే సంతకాల సేకరణ చేసిన ఘనుడన్న రేణుకా చౌదరి
  • సాక్షి టీవీ యాజమాన్యంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తానన్న రేణుకా చౌదరి

దమ్ము, ధైర్యం ఉంటే వైఎస్ జగన్ అమరావతి ప్రాంతంలో పర్యటించాలని రాజ్యసభ సభ్యురాలు, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి సవాల్ విసిరారు. సాక్షి ఛానల్ డిబేట్‌లో జర్నలిస్ట్ కృష్ణంరాజు అమరావతి ప్రాంతంపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. జర్నలిస్ట్ కృష్ణంరాజుతో పాటు యాంకర్‌గా వ్యవహరించిన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు, సాక్షి యాజమాన్యంపై రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది.

ఈ అంశంపై రేణుకా చౌదరి ఓ ప్రముఖ ఛానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఘాటుగా స్పందించారు. వైఎస్ జగన్మోహనరెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ కు మానసిక చికిత్సను తాను ఉచితంగా చేయిస్తానని ప్రకటించారు. అమరావతి ప్రాంత మహిళలపై చేసిన అసభ్యకర వ్యాఖ్యల పట్ల ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ జగన్మోహనరెడ్డి వ్యవహరించిన తీరుపైనా ఆమె విమర్శలు చేశారు.

తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు జరగకముందే అధికార దాహంతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జగన్ చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వైఎస్ జగన్ తీరు దున్నపోతు మీద వర్షం పడిన చందంగా ఉందని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాడు జగన్ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తే ఎలా వ్యవహరించారో అందరూ చూశారని అన్నారు. బయట వాళ్లను మాటలు అంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

అమరావతిపై వైఎస్ జగన్ పట్టిన కక్షసాధింపు అందరికీ గుర్తుందన్నారు. మహిళలను జగన్ అతి తక్కువగా అంచనా వేశారన్నారు. సాక్షి పేపరు, సదరు టీవీని ముందు మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాస్తానని చెప్పారు. మహిళలు వేసుకున్నవి గాజులు కాదని, విష్ణు చక్రాలని ఆమె అభివర్ణించారు. జగన్ బతుకేమిటో తనకు తెలుసునని అన్నారు. అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఎవరైనా తీవ్రంగా వ్యతిరేకించడమే కాదు ఖండిస్తారని రేణుకా చౌదరి పేర్కొన్నారు. 

Renuka Chowdhury
YS Jagan
Amaravati
Sakshi TV
Kommineni Srinivasa Rao
Journalist Krishnam Raju
Andhra Pradesh Politics
Congress Party
TDP
YSRCP
  • Loading...

More Telugu News