Godam Nagesh: స్టేడియంలో ఈదురుగాలుల బీభత్సం.. ఎంపీ గోడం నగేశ్‌కు త్రుటిలో తప్పిన ముప్పు

- ఆదిలాబాద్‌లో రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ హాకీ పోటీలకు ఆటంకం
- ప్రారంభోత్సవం రోజే విరుచుకుపడ్డ భారీ గాలి వాన
- ఎంపీ గోడం నగేశ్‌కు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
- ఈదురు గాలులకు ఎగిరిన టెంట్లు, విరిగిన కర్రలు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా మైదానంలో సోమవారం జరగాల్సిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ హాకీ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రకృతి విఘాతం కలిగించింది. కార్యక్రమం ప్రారంభానికి కొద్ది క్షణాల ముందు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దాదాపు అరగంట పాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది.
వివరాల్లోకి వెళితే, రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ హాకీ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ గోడం నగేశ్ హాజరయ్యారు. మైదానంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు వెళుతున్న సమయంలో బలమైన ఈదురు గాలులు వీచాయి. టెంట్లు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరాయి. టెంట్లకు అమర్చిన కర్రలు విరిగి ఆయన సమీపంలోనే పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన ఎంపీ భద్రతా సిబ్బంది ఆయనను సురక్షితంగా అక్కడి నుంచి వాహనంలోకి తరలించారు. దీంతో ఎంపీ నగేశ్ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు.
ఈ పరిణామంతో మైదానంలో ఉన్న క్రీడాకారులు, అధికారులు, ప్రేక్షకులు భయాందోళనలకు గురయ్యారు. క్రీడాకారులు తమను తాము కాపాడుకునేందుకు మైదానం నుంచి సురక్షిత ప్రదేశాలకు పరుగులు తీశారు. అరగంట పాటు కొనసాగిన ఈ గాలివాన బీభత్సానికి మైదానంలోని ఏర్పాట్లు చాలావరకు దెబ్బతిన్నాయి. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో నిర్వాహకులు, అధికారులు, హాజరైన వారంతా ఊపిరి పీల్చుకున్నారు.