Donald Trump: నాడు బైడెన్ ను హేళన చేసిన ట్రంప్ కు నేడు అదే పరిస్థితి.. వీడియో ఇదిగో!

Donald Trump Stumbles on Air Force One Steps Video Viral
  • ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కుతూ తడబడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
  • క్యాంప్ డేవిడ్‌కు వెళ్లే క్రమంలో ఘటన
  • బైడెన్‌ను ట్రోల్ చేసిన సంగతి గుర్తుకొస్తోందా అంటూ నెటిజన్ల కామెంట్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమానం మెట్లు ఎక్కుతూ తడబడ్డారు. ఆదివారం ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో న్యూజెర్సీలోని బెడ్‌మిన్‌స్టర్ నుంచి క్యాంప్ డేవిడ్‌కు బయలుదేరుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. విమానం మెట్లు ఎక్కుతుండగా ఆయన ఒక మెట్టు తప్పి తూలారు. అయితే, వెంటనే తేరుకుని, తనంతట తానుగా బ్యాలెన్స్ చేసుకుని విమానంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.

గతంలో జో బైడెన్ ఇలాగే విమానం ఎక్కుతూ పలుమార్లు తడబడినప్పుడు ట్రంప్ ఆయనను ఎగతాళి చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ట్రంప్ కూడా అదే రీతిలో తడబడటంతో నెటిజన్లు ఆ పాత విషయాలను గుర్తు చేస్తున్నారు. క్యాంప్ డేవిడ్ పర్యటనకు ముందు, 78 ఏళ్ల ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ఇటీవలి వలస దాడుల నేపథ్యంలో లాస్ ఏంజెలెస్‌లో జరుగుతున్న నిరసనలను అదుపు చేయడానికి ఇన్సరెక్షన్ యాక్ట్‌ను ప్రయోగించే ఆలోచన ఉందా అని విలేకరులు ప్రశ్నించారు. అయితే, దీనిపై ఆయన స్పందించలేదు.

విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో కలిసి ట్రంప్ మీడియాతో మాట్లాడారు. క్యాంప్ డేవిడ్ పర్యటన ఉద్దేశం గురించి అడగ్గా "మేము క్యాంప్ డేవిడ్‌కు వెళ్తున్నాము. చాలా ముఖ్యమైన విషయాలపై వివిధ వ్యక్తులతో సమావేశాలు ఉన్నాయి" అని ట్రంప్ క్లుప్తంగా సమాధానమిచ్చారు. మరిన్ని వివరాలు చెప్పాలని కోరగా, "ఇవన్నీ చాలా ముఖ్యమైనవి, కానీ నేను ఇప్పుడు వివరాల్లోకి వెళ్లలేను" అని ఆయన తెలిపారు. క్యాంప్ డేవిడ్‌లో జరిగే సమావేశాలకు ఎవరైనా "విదేశీ అతిథులు" హాజరవుతున్నారా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేనంటూ ట్రంప్ బదులిచ్చారు.
Donald Trump
Trump stumbles
Joe Biden
Air Force One
Camp David
Marco Rubio
US President
New Jersey
Insurrection Act
Los Angeles

More Telugu News