Uber: ఇక ఉబెర్ హెలికాప్టర్ సేవలు.. ఎక్కడంటే?

Uber Helicopter Services Launched in Italy

  • ఇటలీలోని అమాల్ఫీ తీరంలో ఉబెర్ కొత్త సేవలు
  • ట్రాఫిక్‌ చిక్కులకు చెక్ పెట్టేందుకేనట
  • సోరెంటో - కాప్రి మధ్య 'ఉబెర్ కాప్టర్'
  • 48 గంటల ముందు బుకింగ్.. ఒక్కొక్కరికి 250 యూరోల ఛార్జీ

టాక్సీ సేవలందించే ప్రముఖ యాప్ ఉబెర్ లో సరికొత్త సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు కార్, ఆటో, బైక్ మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉండగా.. తాజాగా హెలికాప్టర్ బుకింగ్ సర్వీసును కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే, ఈ సర్వీస్ కేవలం ఇటలీలో మాత్రమే అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది. ఇటీవలి కాలంలో పర్యాటకుల రద్దీ పెరగడంతో ఇటలీలోని అమాల్ఫీ తీరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది.

కొద్ది దూరం ప్రయాణించాలన్నా చాలా సమయం పడుతోంది. దీంతో ఈ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టడానికి, పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పరిచయం చేయడానికి హెలికాప్టర్, బోట్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఉబెర్ తెలిపింది. ముఖ్యంగా, పర్యాటకులను అమితంగా ఆకర్షించే అమాల్ఫీ కోస్ట్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని ఉబెర్ భావిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. 'ఉబెర్ కాప్టర్' పేరుతో జూలై 26 నుంచి ఆగస్టు 23 వరకు సోరెంటో, కాప్రి పట్టణాల మధ్య ప్రత్యేక హెలికాప్టర్ సర్వీసులు నడపనున్నారు. ఉబెర్ యాప్ లో ప్రయాణికులు 48 గంటల ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సేవలు ప్రతి శని, ఆదివారాల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. హెలికాప్టర్ ఉదయం 9 గంటలకు సోరెంటో నుంచి బయలుదేరి, సాయంత్రం 5 గంటలకు కాప్రి నుంచి తిరిగి వస్తుంది. ఇద్దరు పైలట్లు నడిపే ఈ హెలికాప్టర్‌లో ఒకేసారి ఆరుగురు ప్రయాణించవచ్చు.

ఒక్కో వ్యక్తికి ప్రయాణ ఖర్చు సుమారు 24,450 రూపాయలు (250 యూరోలు) ఉంటుందని అంచనా. హెలిప్యాడ్ వరకు రానుపోను రవాణా సౌకర్యాన్ని కూడా ఈ ప్యాకేజీలోనే కల్పిస్తారు. అంతేకాకుండా, ఉబెర్ సంస్థ జూలై 26 నుంచి ఆగస్టు 24 మధ్య ఇటలీలో 'ఉబెర్ బోట్' సేవలను కూడా ప్రారంభించనుంది. పర్యాటకులు సోరెంటో మెరీనా నుంచి ఇటాలియన్ గొజో 35 బోట్లపై ప్రయాణిస్తూ సముద్ర తీర ప్రాంత అందాలను వీక్షించవచ్చు. 12 మంది వరకు ప్రయాణించేందుకు వీలుగా ప్రైవేట్ చార్టర్లు కూడా అందుబాటులో ఉంచుతారు.

Uber
Uber Helicopter
Italy
Amalfi Coast
Sorrento
Capri
Uber Boat
Tourism
Helicopter Service
Travel
  • Loading...

More Telugu News