హిమాలయాల్లో విషాదం.. పర్వతారోహణ చేస్తూ కృష్ణా జిల్లా వాసి మృతి

  • మృతుడు కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ ఇంజినీరు అడుసుమ‌ల్లి ల‌క్ష్మ‌ణ‌రావు
  • అనుభవజ్ఞుల బృందంతో హిమాలయ యాత్రకు వెళ్లిన వైనం
  • ప్రతికూల వాతావరణం, క్లిష్ట పరిస్థితులే మృతికి కారణం
  • అమరావతిలో విషాదం, మృతదేహం తరలింపునకు ఏర్పాట్లు
విహార‌యాత్ర‌లో విషాదం చోటుచేసుకుంది. ఏపీలోని కృష్ణా జిల్లా విజ‌య‌వాడ‌కు చెందిన ఒక ప్రముఖ ఆర్కిటెక్ట్ ఇంజినీర్ అడుసుమ‌ల్లి ల‌క్ష్మ‌ణ‌రావు హిమాలయ పర్వతారోహణ యాత్రలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దురదృష్టకర సంఘటన ఆయన కుటుంబ సభ్యులలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పర్వత శ్రేణులలో ఒకటైన హిమాలయాల్లో ఈయన సాహస యాత్ర చేస్తూ ప్రాణాలు కోల్పోయారు.

సాహస యాత్రల పట్ల అమితమైన ఆసక్తి కలిగిన ఈయన, అనుభవజ్ఞులైన పర్వతారోహకుల బృందంతో కలిసి ఈ యాత్రకు వెళ్లినట్లు సమాచారం. హిమాలయాల్లోని అత్యంత కఠినమైన శిఖరాలలో ఒకదానిని అధిరోహిస్తుండగా ల‌క్ష్మ‌ణ‌రావు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఊహించని విధంగా వాతావరణం తీవ్రంగా ప్రతికూలించడంతో పాటు క్లిష్టమైన పరిస్థితులు ఎదురయ్యాయి. అవే ఆయన మరణానికి దారితీశాయని ప్రాథమికంగా తెలిసింది. 

అమరావతిలోని ల‌క్ష్మ‌ణ‌రావు స్నేహితులు, సహోద్యోగులు మాట్లాడుతూ... మృతుడు తన వృత్తి పట్ల గొప్ప అంకితభావంతో ఉండేవారని, కృష్ణా ప్రాంతంలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. డిజైన్, ఇంజనీరింగ్ రంగాల్లో ఆయనకున్న నైపుణ్యం అందరికీ సుపరిచితమేనని, స్థానిక అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణవార్త తెలియగానే ఆర్కిటెక్చర్ రంగ ప్రముఖులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి చెంది సంతాపం తెలుపుతున్నారు.


More Telugu News