IAS officer: ఒడిశాలో రూ.10 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఐఏఎస్ అధికారి

Dhiman Chakma IAS Officer Caught Red Handed Taking Bribe in Odisha
  • కలహండి జిల్లా ధర్మగఢ్ సబ్-కలెక్టర్ ధీమాన్ చక్రపై విజిలెన్స్ చర్యలు
  • వ్యాపారి నుంచి మొత్తం రూ. 20 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణ
  • అధికారి నివాసంలో సోదాలు.. మరో రూ. 47 లక్షల నగదు స్వాధీనం
  • అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం
ఒడిశాలో ఒక యువ ఐఏఎస్ అధికారి లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. కలహండి జిల్లా ధర్మగఢ్ సబ్-కలెక్టర్‌గా పనిచేస్తున్న 2021 బ్యాచ్‌కు చెందిన ధీమాన్ చక్మ‌, ఒక వ్యాపారి నుంచి రూ. 10 లక్షలు లంచం తీసుకుంటున్న స‌మ‌యంలో ఆదివారం విజిలెన్స్ అధికారులు ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

విజిలెన్స్ విభాగం అధికారుల కథనం ప్రకారం... ధీమాన్ చక్మ‌ ఒక స్థానిక వ్యాపారిని ప్రభుత్వపరమైన చర్యలు తీసుకుంటానని బెదిరించి, మొత్తం రూ. 20 లక్షలు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆ వ్యాపారవేత్త ముందుగా రూ. 10 లక్షలు చెల్లించినప్పటికీ, ఆ తర్వాత విజిలెన్స్ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన అధికారులు పక్కా ప్రణాళికతో వలపన్నారు. ఆదివారం ధీమాన్ తన ప్రభుత్వ నివాసంలో వ్యాపారి నుంచి మిగిలిన రూ. 10 లక్షల లంచం తీసుకుని, ఆ డబ్బును టేబుల్ డ్రాయర్‌లో పెడుతుండగా విజిలెన్స్ అధికారులు ఆయనను పట్టుకున్నారు.

లంచంగా స్వీకరించిన రూ. 10 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ సమయంలో ఆయన నివాసం నుంచి వివిధ డినామినేషన్లలో ఉన్న 26 కట్టల కరెన్సీ నోట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

అలాగే విజిలెన్స్ అధికారులు ధీమాన్ అధికారిక నివాసంలో ఇంకా లోతుగా సోదాలు నిర్వహించగా, అదనంగా మరో రూ. 47 లక్షల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ భారీ మొత్తంలో నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై అవినీతి నిరోధక చట్టం 2018, సెక్షన్ 7 కింద కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు.

ధీమాన్ చక్మ‌ వాస్తవానికి త్రిపురలోని కాంచన్‌పూర్‌కు చెందినవారు. ఆయన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారిగా కూడా పనిచేశారు. 2020 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 482వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన ఆస్తులపై సోదాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ కేసులో మరిన్ని వివరాలు దర్యాప్తులో వెలుగుచూసే అవకాశం ఉంది.
IAS officer
Dhiman Chakma
Odisha
bribe
corruption
Kalahandi district
vigilance raid
cash seizure
sub-collector
government official

More Telugu News