Sridhar: థియేటర్ల బంద్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదు.. బంద్ అంశాన్ని వారే వివాదాస్పదం చేశారు: శ్రీధర్

Sridhar Clarifies No Theater Bandh Announcement by Telangana Film Chamber
  • థియేటర్ల బంద్ వెనుక నలుగురున్నారు.. త్వరలో పేర్లు వెల్లడిస్తామన్న కార్యదర్శి
  • హీరోలు సినిమాలు తగ్గించడం వల్లే సింగిల్ స్క్రీన్లకు కష్టాలు అన్న శ్రీధర్
  • ఈ ఏడాది ఇప్పటిదాకా మూడు సినిమాలే హిట్ అయ్యాయని ఆవేదన
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ థియేటర్ల బంద్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదని, అలాగే తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌కు ఎలాంటి లేఖ రాయలేదని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యదర్శి శ్రీధర్ స్పష్టం చేశారు. ఫిల్మ్ ఛాంబర్ నూతన కార్యదర్శిగా శ్రీధర్‌ను సభ్యులు ఎన్నుకున్నారు.

నూతన కార్యవర్గ సభ్యులకు జరిగిన సన్మానం సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ, ఇటీవల థియేటర్ల బంద్ అంశాన్ని ఇద్దరు దర్శకులు, మరో ఇద్దరు నిర్మాతలు అనవసరంగా వివాదాస్పదం చేశారని ఆరోపించారు. వారి పేర్లను త్వరలోనే వెల్లడించి, తగిన 'రిటర్న్ గిఫ్ట్' ఇస్తామని హెచ్చరించారు. హీరోలు రెండేళ్లకో సినిమా చేస్తుండటంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి దయనీయంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

"ఇటీవల సికింద్రాబాద్‌లోనే ఆరు థియేటర్లు మూతపడ్డాయి. జనవరి నుంచి ఇప్పటివరకు 'సంక్రాంతి వస్తున్నాం', 'మ్యాడ్ స్క్వేర్', 'కోర్టు' చిత్రాలు మాత్రమే విజయం సాధించాయి. ఇలాగైతే మేం ఎలా బతకాలి?" అని ఆయన ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ సినిమా కోసం థియేటర్లను ఖాళీగా ఉంచితే, ఆ సినిమా వాయిదా పడిందని, దీంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వాపోయారు.

"అనవసరంగా సింగిల్ స్క్రీన్లను బదనాం చేస్తున్నారు. హీరోలకు స్టార్ హోదా ఎక్కడి నుంచి వచ్చింది? ఒకప్పుడు హీరోలు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేవారు. ఇప్పుడు ఒక్కో హీరో ఏడాదికి ఒక్క సినిమా కూడా చేయడం లేదు. రూ.10 లక్షలు తీసుకునే హీరోకి తర్వాతి సినిమాకు రూ.30 లక్షలు ఇస్తున్నారు. ఇటీవల విడుదలైన ఓ సినిమా డిజాస్టర్ అయితే, ఆ హీరోని పిలిచి రూ.13 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారు" అని శ్రీధర్ ఆరోపించారు.

థియేటర్లు తమ ఆస్తులని, వాటిని తాము ఏమైనా చేసుకుంటామని అన్నారు. "థియేటర్లు ఉన్నవాళ్లమంతా ఒకే గొడుగు కిందకు వచ్చాం. మా గ్రూపును చూసి ఎగ్జిబిటర్ వస్తే నాలుగు డబ్బులు దొరుకుతాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లను కూడా మల్టీప్లెక్స్ తరహాలోనే నిర్వహిస్తున్నాం. ప్రేక్షకుడికి తక్కువ ధరతో పాటు, 80 రూపాయలకే పాప్ కార్న్, 30 రూపాయలకే కూల్‌డ్రింక్‌ అందిస్తున్నాం" అని ఆయన వివరించారు.
Sridhar
Telangana Film Chamber
Theaters Bandh
Telugu Film Chamber
Single Screen Theaters

More Telugu News