Konda Vishweshwar Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Konda Vishweshwar Reddy Comments on Kaleshwaram Project Design

  • ప్రాజెక్టు డిజైన్ పూర్తిగా కేసీఆర్ వ్యక్తిగత నిర్ణయమని వెల్లడి
  • ఈటల రాజేందర్, హరీశ్ రావులకు డిజైన్ చర్చల్లో ప్రమేయం లేదని స్పష్టం
  • చేవెళ్లకు నీళ్లిస్తామన్న కాంగ్రెస్ మాట నిలబెట్టుకోలేదని విమర్శ
  • నిజం మాట్లాడినందుకే ఈటలను కేసీఆర్ పార్టీ నుంచి పంపించారని వ్యాఖ్య

కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ రూపకల్పన బాధ్యత పూర్తిగా నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని, ఈ విషయంలో మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌కు ఎలాంటి ప్రమేయం లేదని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు డిజైన్‌పై జరిగిన చర్చల్లో హరీశ్ రావు గానీ, ఈటల రాజేందర్ గానీ పాల్గొనలేదని ఆయన తెలిపారు.

తాను ఈటల రాజేందర్‌కు మద్దతు ఇవ్వడానికి రాలేదని, కేవలం వాస్తవాలు చెప్పడానికే వచ్చానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఈటల రాజేందర్... కేసీఆర్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారంటూ జరుగుతున్న ప్రచారం నూటికి నూరు శాతం అబద్ధమని ఆయన ఖండించారు. ఈటల ఎప్పుడూ నిజాన్ని నిర్భయంగా చెప్పే వ్యక్తని కొనియాడారు. "గులాబీ జెండా అందరిది, ఏ ఒక్కరి సొత్తు కాదు" అన్నందుకే ఈటలను బీఆర్ఎస్ పార్టీ నుంచి తరిమేశారని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కేసీఆర్ ఏది చెబితే దానికి తలూపే ఇంజినీర్లు ఉండేవారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పూర్తిచేసి, నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో గొప్పలు చెప్పారని అన్నారు. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా చేవెళ్లకు ఒక్క చుక్క నీరు కూడా రాలేదని ఆయన ఆరోపించారు. మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.

Konda Vishweshwar Reddy
Kaleshwaram Project
Etela Rajender
KCR
Telangana
Harish Rao
  • Loading...

More Telugu News